● ఎమ్మెల్యే విరూపాక్షి కుటుంబాన్ని
పరామర్శించిన జెడ్పీ చైర్మన్
చిప్పగిరి: టీడీపీ నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా చివరకు న్యాయమే గెలుస్తుందని జెడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. చిప్పగిరిలో ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి కుటుంబాన్ని శుక్రవారం జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీ సభ్యులు పరామర్శించారు. కేసు వివరాలు, బెయిల్ మంజూరు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. ఈ నెల రెండో తేదీన చంద్రబాబు ప్రభుత్వం అక్రమంగా ఎమ్మెల్యే బుసినె విరూపాక్షిని అరెస్టు చేసి జిల్లా కారాగారంలో ఉంచిందన్నారు. కలవడానికి తమను అనుమతించడం లేదన్నారు. కేసులో పురోగతి లేకుండా జాప్యం చేస్తూ బెయిల్ రాకుండా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు. టీడీపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసినా చివరకు న్యాయమే గెలుస్తుందన్నారు. జెడ్పీటీసీ సభ్యులు మురళీధర్ రెడ్డి, కిట్టు తదితరులు పాల్గొన్నారు.


