కర్నూలు(హాస్పిటల్): స్టైఫండ్ పెంచాలన్న ప్రధాన డిమాండ్‌తో గత నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లు శుక్రవారం ఆందోళన ఉద్ధృతం చేశారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆసుపత్రిలో విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. ఈ మేరకు ఉదయం కర్నూలు మెడికల్ కాలేజి నుంచి రాజ్‌విహార్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ కలెక్టరేట్‌కు చేరుకోగా మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఏపీ జూనియర్ డాక్టర్ల సంఘం కర్నూలు అధ్యక్షుడు డాక్టర్ నిశాంత్ మాట్లాడుతూ నాలుగు రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని, ఈ నెల 15వ తేది సాయంత్రం 5 గంటల వరకు వేచి చూస్తామని, ఆ తర్వాత భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వాసుపత్రిలో తీవ్ర అసౌకర్యాల నడుమ జూనియర్ డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారని, వారిపై పనిభారం అధికమైందన్నారు. నిబంధనల ప్రకారం పెంచాల్సిన 30 శాతం స్టైఫండ్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, కేవలం 3 శాతం పెంచుతామని చెబుతోందని, ఇది చాలా అన్యాయమన్నారు.


