కర్నూలు(అగ్రికల్చర్): ఖరీఫ్ ప్రారంభమై పొలాల్లో పంటలు ఎండిపోయి.. రెండోసారి విత్తనం వేయడానికి రైతులు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యక్తిగత యంత్ర పరికరాలు పంపిణీ చేస్తామని ప్రకటిస్తోంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానించి అర్హుల జాబితా ఇన్‌చార్జ్ మంత్రి టేబుల్‌పైకి వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోంది. గత ఆర్థిక (2025–26) సంవత్సరం చివరిలో వ్యక్తిగత వ్యవసాయ యంత్ర పరికరాలు ‘లాటరీ’ ద్వారా ఇస్తామని ఇవ్వలేదు. అలాగే 2024–25 ఆర్థిక సంవత్సరం ముగింపు సమయంలో మార్కెట్ కంటే రెట్టింపు ధరలతో యంత్రపరికరాలు పంపిణీ చేశారు. ఈ ఏడాది ఇస్తారో, ఇవ్వరో, టీడీపీ కార్యకర్తలకు కట్టబెడతారో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పంపిణీ మరింత ‘నిమ్మల’ం!
ఈ ఆర్థిక సంవత్సరం రైతులకు వ్యక్తిగతంగా హార్వెస్టర్లు, స్ప్రేయర్లు, విత్తనం గొర్రులు, ట్రాక్టర్లు, రోటావేటర్లు, ట్రాక్టర్ ట్రాలీస్ తదితర వాటిని మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం రూ.9.41 కోట్లతో వ్యక్తిగత వ్యవసాయ యంత్రపరికరాలు పంపిణీ చేసేందుకు ఆన్‌లైన్‌లో రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అయితే రూ.89.41 కోట్ల విలువ కలిగిన 7,849 యంత్ర పరికరాల కోసం రైతుల ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అప్‌లోడ్ చేశారు. దరఖాస్తుల స్వీకరణ గడువు పూర్తి అయి నాలుగైదు నెలలు కాగా.. పలు సార్లు షెడ్యూలులో మార్పు చేశారు. రైతుల జాబితాలను జిల్లా వ్యవసాయ యంత్రాంగం ఇన్‌చార్జ్ మంత్రి నిమ్మల రామనాయుడుకు పంపారు. రైతుల ఎంపికలో లాటరీ విధానం అమలు చేయకుండా మంత్రికి పంపడం పలు అనుమానాలకు తావు ఇస్తోంది. టీడీపీ కార్యకర్తలకు యంత్ర పరికరాలు అప్పగించేందుకే ఇలా చేశారని తెస్తోంది. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జాబితాలకు ఆమోదం తెలిపిన తర్వాతనే పంపిణీకి అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
కస్టమ్స్ హయరింగ్ సెంటర్లు ఏవీ?
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆర్‌బీకేల వారీగా కస్టమ్ హయ్యరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది. చంద్రబాబు ప్రభుత్వం కూడా 2026–27 నుంచి కస్టమ్ హయ్యరింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. జిల్లా లో రూ.13.30 కోట్ల సబ్సిడీతో సీహెచ్‌సీ ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆర్‌బీకే స్థాయి లో రూ.10 లక్షలు, సబ్ డివిజన్ స్థాయిలో రూ.30 లక్షలతో సీహెచ్‌సీలు ఏర్పాటు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. అయితే దీనిపై అతీగతీ లేకుండా పోయింది. కాగితాలపై ఆదేశాలు ఇవ్వడం. దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం, తదుపరి ఎలాంటి చర్యలు లేకపోవడం షరా మామూలుగా మారింది.
ఖరీఫ్ ప్రారంభమైనా ఇప్పటి వరకు
అందని పరికరాలు
ప్రస్తుతం అర్హుల జాబితా జిల్లా
ఇన్‌చార్జ్ మంత్రి టేబుల్‌పైకి
టీడీపీ కార్యకర్తల కోసం కసరత్తు
కనిపించని సీహెచ్‌సీలు!


