● శ్రీశైలంలో 863 అడుగులకు పైగా చేరిన నీటి నిల్వ ● రాయలసీమకు తాగునీటికే విడుదల అని ప్రకటన ● ఆయకట్టుకు నీరు ఇచ్చేది లేదని స్పష్టత ● నోరు మెదపని టీడీపీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు
కర్నూలు (సిటీ): ఎగువన కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మ పరుగులు పెడుతూ శ్రీశైలం చేరుతోంది. ఇప్పటికే కనీస నీటి మట్టానికిపైగా నీటి నిల్వలు చేరాయి. సాగునీటి ప్రాజెక్టులకు నీరు విడుదల చేయాల్సి ఉంది. అయితే సీమ ప్రాంతానికి తాగునీరుకు మాత్రమేనని, ఆయకట్టుకు నీరు ఇచ్చేందుకు సాధ్యం కాదని అధికారక ప్రకటన వచ్చింది. ఇదేమిటని రాయలసీమలోని మంత్రులు, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం (215 టీఎంసీలు)కు చేరకముందే తెలంగాణ ప్రభుత్వం కుడి విద్యుత్కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. ఏపీ ప్రభుత్వం సైతం కుడి విద్యుత్కేంద్రం నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ందుకు సిద్ధం అయ్యింది. రెండు విద్యుత్కేంద్రాల ద్వారా రోజుకు 2 టీఎంసీలకుపైగా నీటిని మొదలు పెట్టి రోజుకు 6 టీఎంసీల వరకు వినియోగించే అవకాశం ఉంది. ఇలా జరిగితే రిజర్వాయర్‌లో నీటి మట్టం పెరగడం తగ్గి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ జిల్లాకు నీటిని తీసుకునేందుకు అవకాశాలు తగ్గే ప్రమాదం ఉంది.
కేఆర్‌ఎంబీ నిర్ణయం సాకు
కృష్ణా నది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో జూరాలకు వరదనీరు గత వారం రోజులుగా భారీగానే వచ్చి చేరుతోంది. ఆ నీరంతా దిగువకు వదిలేయడంతో శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటిమట్టం 867 అడుగులకు పైగా చేరుకుంది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో నీటి నిల్వ 130 టీఎంసీలకుపైగా చేరుకుంది. ప్రస్తుతం 2.38 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. రెండు రోజుల క్రితమే రాయలసీమ జిల్లాలకు సాగునీటిని విడుదల చేసేందుకు పోతిరెడ్డిపాడు గేట్ల స్పిల్‌వేకి నీటి మట్టం చేరింది. 854 అడుగులకు నీటిమట్టం చేరిన తర్వాత నీరిచ్చేందుకు అవకాశమున్నప్పటికీ కేఆర్‌ఎంబీ నిర్ణయం సాకు చూపించి తాగునీటికి మాత్రమే విడుదల చేయనున్నారు. గురువారం ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య 3 వేల క్యుసెక్కులకుపైగా విడుదల చేయనున్నారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ఆధారిత ప్రాజెక్టులకు 10 టీఎంసీలు, మద్రాసు తా గునీటికి 10 టీఎంసీలు, హంద్రీనీవా సుజల స్రవంతి పథకానికి 13 టీఎంసీల నీటిని కేవలం తాగు నీటి అవసరాల కోసం మాత్రమే ఇవ్వనున్నారు.
కృష్టా డెల్టాకు సాగునీరు
కృష్ణాడెల్టాకు మాత్రం 32 టీఎంసీల నీటిని ఆయకట్టు కేటాయించినట్లు తెలుస్తోంది. శ్రీశైలం నుంచి కుడి, ఎడమ విద్యుత్కేంద్రాల ద్వారా విడుదల చేసే నీటి నుంచే వాడుకోనున్నారు. కృష్ణాడెల్టాకు ఇప్పటికే గోదావరి జలాలను పట్టిసీమ ద్వారా తరలిస్తున్నామని టీడీపీ నేతలు ప్రచారం చేశారు. ఇప్పుడు శ్రీశైలం నీటిని ఎందుకు దిగువకు తీసుకపోతున్నట్లు అనే ప్రశ్న రాయలసీమ రైతుల్లో వస్తోంది.
మల్యాల నుంచి నీటి విడుదల!
హంద్రీ–నీవా సుజల స్రవంతి పథకం ద్వారా నీటిని విడుదల చేసేందుకు నాలుగు రోజుల క్రితమే శ్రీశైలంలో 834 అడుగులకు చేరుకుంది. ముచ్చుమర్రి లిఫ్ట్ నుంచి మల్యాలకు నీటిని 820 అడుగుల నుంచే పంపింగ్ చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. శ్రీశైలంలో 40 టీఎంసీల నీరు ఉన్నప్పటికీ తాగునీటి సాకుతో తెలంగాణ ప్రభుత్వం కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి 1,600 క్యుసెక్కుల నీటిని రోజుకు జూన్ నెల 25వ తేదీ నుంచే పంపింగ్ చేస్తున్నారు. ఏపీ పాలకులకు సీమ ప్రజల తాగు నీటి అవసరాలకు సైతం శ్రీశైలంలో 820 అడుగులకుపైగా నీరు చేరినా నాలుగైదు రోజులుగా ఏ మాత్రం పట్టించుకోలేదు. బుధవారం సాయంత్రం మల్యాల లిఫ్ట్ నుంచి ఓ మోటరును ఆన్ చేసి 350 క్యుసెక్కుల నీటిని హెచ్‌ఎన్‌ఎన్‌ఎస్ కాల్వకు విడుదల చేస్తున్నారు. గురువారం నుంచి రోజు రోజుకు నీటి విడుదలను పెంచనున్నారు.
మౌనమెందుకు?
తుంగభద్ర జలాశయంలో ప్రస్తుతం 60 టీఎంసీలకుపైగా నీటి నిల్వలు చేరాయి. ఎగువ నుంచి డ్యాంలోకి బుధవారం మధ్యాహ్నానికి 75 వేల క్యుసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. వాస్తవానికి డ్యాంలో 40 టీఎంసీలకుపైగా నీటి నిల్వలు ఉండి, ఎగువ నుంచి 50 వేలకుపైగా ఇన్‌ఫ్లో ఉంటే ఆయకట్టుకు నీరు ఇవ్వాలని బోర్డు నిబంధనలు ఉన్నాయి. కానీ అంతకు మించి నీటి నిల్వలు ఉన్నప్పటికీ ఇంత వరకు ఎగువ, దిగువ కాలువలకు సాగు నీరు ఇవ్వండని చంద్రబాబు ప్రభుత్వానికి చెందిన మంత్రుల నుంచి కానీ, అధికార యంత్రాంగం నుంచి కానీ ప్రతిపాదనలు లేకపోవడం గమనార్హం. వర్షాలు సక్రమంగా రాకపోవడంతో పశ్చిమ పల్లె ఆయకట్టుదారులు సాగు చేసిన పంటలు వానలు లేక ఎండిపోతున్నాయి. టీబీ డ్యాం నుంచి నీటి విడుదలపై ఎందుకు టీడీపీ నేతలు మౌనంగా ఉంటున్నాయే అర్థం కావడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


