కర్నూలు(సెంట్రల్): అసెంబ్లీలో హోంమంత్రి అనిత ప్రకటించిన మేరకు వెంటనే 10వేల ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీపై కేబినెట్‌లో చర్చించి నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా డిమాండ్ చేశారు. బుధవారం డీవైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బిర్లా కంపౌండ్ నుంచి నిరుద్యోగులు ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకొని మెయిన్ గేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా డీవైఎఫ్‌ఐ జిల్లా జిల్లా కార్యదర్శి అబ్దుల్లా మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా పోలీసు కానిస్టేబుల్, ఎస్‌ఐ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవడంలేదన్నారు. అసెంబ్లీలో 10వేల పోలీసు కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించిన ప్రభుత్వం.. జాబ్ క్యాలెండర్‌లో కేవలం 2,500 పోస్టులు మాత్రమే ఉన్నట్లు ప్రకటించడం అన్యాయమన్నారు. వెంటనే నోటిఫికేషన్ ప్రకటించకపోతే నిరుద్యోగుల వయో పరిమితి మించిపోయి పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులవుతారన్నారు. ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులకు వయో పరిమితి పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో హుస్సేన్, హరికిషన్‌రెడ్డి పాల్గొన్నారు.


