● అక్టోబర్ 2, 2024
పవన విద్యుత్ సబ్ స్టేషన్లలో సామగ్రిని ధ్వంసం చేశారని వైఎస్సార్‌సీపీకి చెందిన 24 మందిపై కేసు నమోదు చేశారు. ఆలూరు మండలం మొలగవల్లి గ్రామ సమీపంలోని సబ్ స్టేషన్, ఆస్పరి మండలంలోని జొహరాపురం వద్దనున్న సబ్ స్టేషన్, దేవనకొండ మండలంలోని సబ్ స్టేషన్‌లపై దాడికి పాల్పడిననట్లు పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఎమ్మెల్యే విరూపాక్షి సోదరుడు వెంకటేష్‌తో పాటు దేవనకొండ జెడ్పీటీసీ రామకృష్ణ, ఆస్పరి మండలంలోని బిణిగేరి సర్పంచ్ వెంకటేష్, హాలహర్వి మండలం ఎంపీపీ భర్త పరశురాము, ఇదే మండలంలోని నిట్రవట్టి గ్రామ ఎంపీటీసీ గోపాల్‌తో పాటు వైఎస్సార్ సీపీకి చెందిన నియోజకవర్గ నాయకులపై కేసుపెట్టారు.
● నవంబర్ 3, 2024
తుగ్గలి మండలం శభాషపురానికి చెందిన మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ వలంటీర్ల విభాగం జిల్లా కార్యదర్శి హనుమంతును అక్రమంగా పోలీసులు అరెస్ట్ చేశారు. గ్రామంలో చిన్నపాటి గొడవకు సంబంధించి టీడీపీ కార్యకర్త ఫిర్యాదు మేరకు 326 సెక్షన్ కింద జొన్నగిరి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి గద్వాలకు పెళ్ళికి వెళ్లి తిరిగి వస్తుండగా హనుమంతును ప్యాపిలి హైవేపై పోలీసులు అదుపులోకి తీసుకుని కర్నూలుకు తరలించి వేధింపులకు గురి చేశారు. ఆ తర్వాత కొద్ది రోజులు గ్రామంలోకి వెళ్లకుండా ఆంక్షలు విధించారు.
● నారాలోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా శభాషపురంలో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనికి హనుమంతు కారణమని రెడ్‌బుక్ కుట్రల్లో భాగంగా అక్రమ కేసు బనాయించి వేధించారు.
● జూన్ 30, 2024
నంద్యాల పట్టణానికి చెందిన వైఎస్సార్‌సీపీ జిల్లా మేధావుల ఫోరం అధ్యక్షులు రసూల్ ఆజాద్‌పై టీడీపీ నేత అంజాద్ ఫిర్యాదుతో టూ టౌన్ పోలీసులు 406,408,420,467,468,471,506 సెక్షన్ల కింద అక్రమ కేసులు బనాయించారు.
● డిసెంబర్ 12, 2024
నంద్యాల పట్టణానికి చెందిన వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గన్ని కరిముల్లాపై టీడీపీ నాయకుడు జావిద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు 329, 351, 133, 308 తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో పాటు కరీముల్లాపై రౌడీషీట్ ఓపెన్ చేశారు.
● జూన్ 22, 2024
నంద్యాల మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నీసాపై టీడీపీ నేతలు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదుతో నంద్యాల 3 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
● కక్ష సాధింపునకు పరాకాష్ట
కోడుమూరు నియోజకవర్గంలో కర్నూలు మండలం ఎదురూరు గ్రామానికి చెందిన బోయ వెంకటేశ్వర్లు వైఎస్‌ఆర్‌సీపీ విలేజ్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతున్నారు. వెంకటేశ్వర్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉండటాన్ని జీర్ణించుకోలేక టీడీపీ నాయకులు, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి పోలీసులను అడ్డుపెట్టి నాలుగు సార్లు అక్రమ కేసులు పెట్టించినట్లు ప్రచారం ఉంది. 2024 ఏప్రిల్‌లో గడ్డివాములు కాలిపోగా అధికారంలోకి వచ్చిన తర్వాత అరెస్టు చేయించి జైలుకు పంపారు. 2024 సెప్టెంబర్ 11న తన పొలంలో చేతబడి పూజలు జరిపించాడని, 2024 అక్టోబర్ 15న రెవెన్యూ అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశారని, 2026 ఫిబ్రవరి 25న రుద్రవరం పొలంలో చేతబడి చేశాడనే కారణాలతో బోయ వెంకటేశ్వర్లుపై పలు కేసులు పెట్టించారు.
● పాత కేసును తిరగతోడి..
2013లో గాంధీచౌక్‌లోని జుమ్మామసీదు నిర్వాహణలో కొందరు అవకతవకలకు పాల్పడుతున్నారని ఇషాక్‌బాషా అప్పట్లో ఆరోపణలు చేశారు. ఆయనపై టీడీపీ నేతలు కక్షగట్టి వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేయించారు. అయితే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్న నేపథ్యంలో పాత కేసును తిరగతోడారు. పోలీసుల ద్వారా నోటీసులు పంపి రిమాండ్ చేయించాలని చూశారు. ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో టీడీపీ నేతలు మిన్నకుండిపోయారు.


