పశుగ్రాసానికి పనికి వచ్చే పంటలేవీ? | - | Sakshi
Sakshi News home page

పశుగ్రాసానికి పనికి వచ్చే పంటలేవీ?

Jul 31 2026 1:45 AM | Updated on Jul 31 2026 1:45 AM

ఏమి చేయాలో తెలియడం లేదు

డోన్‌ సంతకు భారీగా వచ్చిన పశువులు

కర్నూలు(అగ్రికల్చర్‌): ఎల్‌నినో తీవ్రత మూగజీవులపై ఎక్కువగా ప్రభావం చూపుతోంది. ఒకవైపు పశుగ్రాసం కొరత, మరోవైపు నీటి కరువుతో రైతులకు పశుపోషణ పెనుభారంగా మారింది. వానాకాలం మొదలై రెండు నెలలు అవుతోంది. ఇప్పటి వరకు చెరువులు, కుంటలు, వాగులు, వంకలు పూర్తి స్థాయిలో జలకళను సంతరించుకోలేదు. సాగు చేసిన పంటలన్నీ ఎండిపోయాయి. లక్షలాది ఎకరాల్లో విత్తనం కూడా వేయని పరిస్థితి ఏర్పడింది. ఏడాది పొడవునా ఇదే పరిస్థితులు ఉంటే పశువులను ఎలా పోషించాలని రైతులు ఆందోళన చెందుతున్నారు.

తప్పుడు లెక్కలు

జిల్లాలో తెల్ల, నల్లజాతి పశువులు 3.40 లక్షలు ఉన్నాయి. గొర్రెలు, మేకలు 18 లక్షలు ఉన్నాయి. ఆవు/ ఎద్దును ఒక యూనిట్‌గా తీసుకుంటారు. గేదెను ఒకటిన్నర యూనిట్‌గా పరిగణిస్తారు. ఒక దూడను 0.6 యూనిట్‌, ఐదు గొర్రెలు/ మేకలను ఒక యూనిట్‌గా వ్యవహరిస్తారు. వీటిని లైవ్‌స్టాక్‌ యూనిట్లుగా పేర్కొంటారు. ఇటువంటి యూనిట్లు ఏడు లక్షలు ఉన్నాయి. జాతి పశువులకు రోజుకు 30 కిలోల పచ్చి మేత, 7–8 కిలోల ఎండమేత అవసరం. నాటు పశువులకు 15 కిలోల పచ్చిమేత, 5–6 కిలోల ఎండుమేత అవసరం. పశుసంవర్ధక శాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో పశుగ్రాసం కొరత లేదు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే ఒకవైపు మేత, మరోవైపు నీటి సమస్యలతో రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సెప్టెంబరు నెల చివరి వరకు జిల్లాకు 3.50 లక్షల టన్నుల పశుగ్రాసం అవసరం అవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే 3.31 లక్షల టన్నుల పశుగ్రాసం అందుబాటులో ఉందని చెబుతున్నారు. 19 వేల టన్నుల వరకు పశుగ్రాసం కొరత ఏర్పడుతుందని, దీనిని నివారించేందుకు పశుగ్రాసం సాగుకు 75 శాతం సబ్సిడీపై గడివిత్తనాలు, 50 శాతం సబ్సిడీపై దాణా సరఫరా చేస్తున్నట్లు చెబుతున్నారు. 26 టన్నుల గడ్డి విత్తనాలు, 946 టన్నుల దాణా సరఫరా చేస్తుండటం వల్ల పశుగ్రాసం కొరత నుంచి బయట పడుతున్నామని కాకి లెక్కలు చూపుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం పశుగ్రాసం కొరత కనిపిస్తోంది.

నీటి తొట్లు ఉన్నా.. లేనట్లే!

వర్షాలు లేకపోవడంతో చెరువులు, వాగులు, వంకల్లో చుక్కనీరు లేకుండా పోయింది. ఇప్పటికే నీటి సమస్యతో ప్రజలు అల్లాడుతున్నారు. ఆస్పరి, ఆలూరు, పెద్దకడబూరు, పత్తికొండ, ఆదోని తదితర మండలాల్లో 20 రోజులకు ఒకసారి నీరు ఇస్తున్నారంటే సమస్య ఏ స్థాయిలో ఉందో తెలుస్తోంది. పశువులు దాహార్తి తీర్చేందుకు ‘ఉపాధి’ నిధులతో 423 నీటితొట్లు నిర్మించారు. ప్రజలకు మంచినీరు ఇవ్వడమే కష్టమైన పరిస్థితుల్లో తొట్లకు నీటిని నింపడం కష్టంగా మారింది. మామూలుగా అయితే గ్రామ పంచాయతీలు తొట్లను నీటితో నింపాల్సి ఉంది. కాలువలకు నీరు రాకపోవడం, చెరువులు, కుంటలు ఎండిపోవడం.. సమస్య తీవ్రం కావడంతో తొట్లను పట్టించుకునే వారు లేకుండా పోయారు. ప్రధానంగా జిల్లా పశ్చిమ ప్రాంతంలో నీటి తొట్లు ఉన్నా లేనట్లేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

పడిపోయిన పాల ఉత్పత్తి

ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 52 లక్షల జనాభా ఉంది. ఇండియన్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ప్రకారం ప్రతి ఒక్కరూ రోజుకు 250 ఎంఎల్‌ పాలు తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రకారం ఉమ్మడి జిల్లాకు 13 లక్షల లీటర్ల పాలు అవసరం అవుతాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక పశుగ్రాసం, నీటి కొరత ఏర్పడంతో పాల ఉత్పత్తి రోజురోజుకు పడిపోతోంది. సాధారణంగా ఉమ్మడి జిల్లాలో రోజుకు 8.58 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి కావాల్సి ఉంది. ప్రస్తుతం 7.2 లక్షల లీటర్ల వరకు మాత్రమే పాలు ఉత్పత్తి అవుతున్నాయి.

మాకు పది ఎకరాల పొలం ఉంది. అందులో ఏడు ఎకరాల్లో కంది, సజ్జ, మూడు ఎకరాల్లో ఉల్లి సాగు చేశాం. వరుసగా నెల రోజుల పాటు వర్షాలు లేకపోవడంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. మాకు రెండు ఎద్దులు, ఆరు బర్రెలు, మూడు దూడలు ఉన్నాయి. వీటికి మేత కోసం ట్రాక్టరు వేరుశనగ పొట్టు రూ.30 వేలకు కొనుగోలు చేశాం. ఇంటికి చేరేందుకు రూ.40 వేల వరకు ఖర్చు వస్తోంది. అది కూడా 45 రోజులకు సరిపోతుంది. తర్వాత ఏమి చేయాలో తెలియడం లేదు. ప్రభుత్వం చొరువ తీసుకొని రైతులకు పశుగ్రాసం సరఫరా చేయాలి. – ఎం.ప్రహ్లాదరెడ్డి, తుగ్గలి

కొన్నేళ్లుగా వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి, ఉల్లి, శనగ పంటలు ఎక్కువగా సాగవుతున్నాయి. రెండు దశాబ్దాల క్రితం పశుగ్రాసానికి పనికి వచ్చే వేరుశనగ, కొర్ర, జొన్న పంటలే ఎక్కువగా సాగు చేసేవారు. అప్పట్లో కరువు పరిస్థితులు ఏర్పడినప్పటికీ పశుగ్రాసానికి ఇబ్బందిగా ఉండేది కాదు. ఇప్పుడు పండించే పంటలు పశుగ్రాసానికి పనికి రావు. కర్నూలు జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 3.02 లక్షల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ఇందులో పత్తి 2.17 లక్షల హెక్టార్లలో, మిగిలిన పంటలన్నీ 85 వేల హెక్టార్లలో ఉన్నాయి. వర్షాభావంతో పంటలు దెబ్బతిన్నాయి. రానున్న రోజుల్లో ఎల్‌నినో తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని సీఎం చంద్రబాబు ప్రకటించడంతో పశుపోషణ ఎలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు.

భారంగా మారిన పశుపోషణ

చెరువులు, కుంటల్లో కనిపించని నీరు

దొరకని పశుగ్రాసం

సంతల్లో పశువులను

అమ్మేస్తున్న రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement