● న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి
లీలా వెంకటశేషాద్రి
కర్నూలు: మానవ అక్రమ రవాణా వ్యవస్థీకృత నేరమని న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి అన్నారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయ సేవా సదన్‌లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి ఆదేశాల మేరకు గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి లీలా వెంకటశేషాద్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మానవ అక్రమ రవాణా గురించి అనేక విషయాలపై మాట్లాడారు. ప్రతి సంవత్సరం జులై 30న ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఐక్యరాజ్య సమితికి సంబంధించిన యూఎన్‌ఓడీసీ సంస్థ ఈ సంవత్సరం మానవ అక్రమ రవాణా అనేది వ్యవస్థీకృత నేరం – దోపిడీని అంతమొందిస్తాం.. అనే నినాదాన్ని తీసుకొచ్చిందని తెలిపారు. కార్మిక శాఖ ఉప కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి చట్టాలను బలోపేతం చేయడం, అవగాహన పెంచుకోవడం, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడం, ఇంటర్నెట్ భద్రతను మెరుగుపరచడం వంటి చర్యలను తీసుకోవాలని తెలిపారు. అనంతరం మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవ వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా న్యాయ సేవా సదన్ నుంచి కొండారెడ్డిబురుజు వరకు ర్యాలీ నిర్వహించారు. డీసీపీఓ శారద, చైల్డ్ వెల్ఫేర్ సభ్యుడు సుధాకర్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్స్ శివరామచంద్రరావు, రాయపాటి శ్రీనివాస్, ఎస్‌ఆర్‌ఈడీఎన్‌జీఓ సుధాకర్ రెడ్డి, పోలీసులు, న్యాయవాదులు, పారా లీగల్ వాలంటీర్లు, ఎన్‌జీఓలు పాల్గొన్నారు.


