ఆదోని జిల్లా కథ ఇక కంచికేనా? | - | Sakshi
Sakshi News home page

ఆదోని జిల్లా కథ ఇక కంచికేనా?

Jul 31 2026 1:45 AM | Updated on Jul 31 2026 1:45 AM

జిల్లా హామీ లేదన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌

ఆదోని: పిడికిలి బిగించి ఎనిమిది నెలలుగా ‘ఆదోని జిల్లాగా ప్రకటించాలి’ అనే డిమాండ్‌తో కొనసాగుతున్న ఉద్యమానికి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్‌ చేసిన తాజా వ్యాఖ్యలు ఊహించని మలుపు తిప్పాయి. అధికారంలోకి వస్తే ఆదోని జిల్లా కల నెరవేరుతుందనే ఆశతో ఎదురు చూసిన ఉద్యమకారులకు ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. దాదాపు 256 రోజులుగా సాగుతున్న ఉద్యమాన్ని అవహేళన చేస్తున్నట్లు అనిపించింది. రెండు రోజుల పర్యటనకు వచ్చిన మంత్రి లోకేష్‌ను జిల్లా సాధన సమితి ప్రతినిధులు కలిసి మరోసారి తమ డిమాండ్‌ను వినిపించారు. జిల్లాగా ప్రకటించాలని విజ్ఞప్తి చేశా రు. అయితే దీనిపై స్పందించిన లోకేష్‌ ‘‘నేను కాని, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గానీ యువగళం పాదయాత్రలో ఎక్కడా ఆదోనిని జిల్లాగా చేస్తామని హామీ ఇవ్వలేదు..అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన పూర్తయిన తర్వాత ఆ అంశాన్ని పరిశీలిద్దాం’’ అని స్పష్టం చేశారు. ఈ ఒక్క వ్యాఖ్యతో జిల్లాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యమకారులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. గత 256 రోజులుగా ఎండా,వానా తేడా లేకుండా రిలే నిరాహార దీక్షలు, ధర్నాలు, నిరసన ర్యాలీలు, ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదోని జిల్లా డిమాండ్‌ను సజీవంగా ఉంచిన ఉద్యమానికి ఈ వ్యాఖ్యలు పెద్ద ఎదురు దెబ్బగా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రతిపక్షంలో మద్దతు..

అధికారంలోకి వచ్చాక భిన్న స్వరం

జిల్లా సాధన ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి అప్పటి టీడీపీ నాయకులు పలుమార్లు ఉద్యమ శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఉద్యమానికి బహిరంగ మద్దతు ప్రకటించారు. ఉద్యమకారులతో కలిసి ధర్నాల్లో పాల్గొనడంతోపాటు ప్రభుత్వం స్పందించాలని డిమాండ్‌ చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి లోకేష్‌ చేసిన వ్యాఖ్యలు అందుకు విరుద్ధంగా ఉన్నాయి. ప్రతిపక్షంలో ఇచ్చిన రాజకీయ మద్దతు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు కనిపించడం లేదని ఉద్యమకారులు ప్రశ్నిస్తున్నారు.

ఉద్యమం కొనసాగుతుందా.. ముగుస్తుందా?

లోకేష్‌ వ్యాఖ్యల తర్వాత జిల్లా సాధన సమితి తదుపరి కార్యాచరణపై దృష్టి సారించింది. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలా? లేక ప్రభుత్వంతో మరోసారి చర్చలు జరపాలా? అనే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటున్నారు ఉద్యమకారులు. ఇదిలా ఉండగా.. ఆదోని జిల్లా కథ ఇక కంచికేనా? అని ప్రజలు పెదవి విరుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement