● హోసూరు కేంద్రంగా
టాటా పవర్ రెన్యువబుల్
ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు
● ఎకరాకు ఏడాదికి రూ.31వేల ప్రకారం
29 సంవత్సరాల 11 నెలలకు లీజు
● బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల్లో
మార్టిగేజ్‌కు కంపెనీకి హక్కులు
● అడ్వాన్సు చెల్లింపుల్లోనూ
కంపెనీ ఇష్టారాజ్యం
కర్నూలు(సెంట్రల్): పత్తికొండ మండలం హోసూరు కేంద్రంగా టాటా పవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ సోలార్ పవర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇందుకోసం 2వేల ఎకరాలను లీజుకు తీసుకోవాలని నిర్ణయించింది. ఎకరాకు ఏడాదికి రూ.31 వేల ప్రకారం 29 సంవత్సరాల 11 నెలలపాటు లీజుకు ఒప్పందం కుదుర్చుకుంటోంది. రెండు సంవత్సరాలకు ఒకసారి రైతులకు లీజు మొత్తంపై 5 శాతాన్ని అదనంగా చెల్లిస్తారు. ఈమేరకు ఇప్పటికే దాదాపు 1,500 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించింది. మరో 500 ఎకరాల భూమిని సేకరించేందుకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో రైతులతో కంపెనీ చేసుకున్న ఒప్పందంలో ఒక భయంకరమైన నిజం బయటకు వచ్చింది. లీజు పేరిట తీసుకున్న భూములను కంపెనీ బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల్లో మార్టిగేజ్ లేదా ఇతర సంస్థలకు లీజును బదలాయించే అధికారం ఉండడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ విషయాన్ని తమకు తెలియకుండా ఒప్పందం ఖరారు చేశారని వాపోతున్నారు. ఈ నిబంధన ప్రకారం బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థల్లో కంపెనీ లోన్ తీసుకొని చెల్లించకపోతే అప్పుడు పరిస్థితి ఏమిటని, తమ భూములకు ఎవరు గ్యారంటీ ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా భూములు ఇచ్చిన రైతులు మధ్యలో అమ్ముకోవాలంటే కంపెనీ అనుమతి తప్పనిసరి చేయడాన్ని కూడా రైతులు వ్యతిరేకిస్తున్నారు. గురువారం సోలార్ పవర్‌కు భూమి పూజ చేసేందుకు వస్తున్న మంత్రి నారా లోకేష్ ఈ విషయంలో రైతులకు న్యాయం చేస్తారా? లేక కార్పొరేటు కంపెనీలకు అండగా నిలుస్తారా? అనే విషయం చర్చనీయాంశంగా మారింది.
ఒక్కో రైతుకు ఒక రకంగా
అడ్వాన్సు చెల్లింపులు
ఇప్పటికే టాటాపవర్ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ సోలార్ పవర్ కోసం పత్తికొండ మండలంలోని హోసూరు, పెద్దహుల్తి, జోహరాపురం గ్రామాల రైతుల నుంచి దాదాపు 1,500 ఎకరాలు సేకరించింది. అయితే ఇందులో ఒక్కో రైతుకు ఒక రకంగా అడ్వాన్స్ చెల్లించింది. కొందరికి రెండు సంవత్సరాలు, మరికొందరికి 10 సంవత్సరాలు, ఇంకొందరికి 20 సంవత్సరాల అడ్వాన్స్ కూడా చెల్లించింది. ఇందులో బ్యాంకుల్లో పొలాలను మార్టిగేజ్ చేసిన రైతులకు సంబంధించి 20 ఏళ్లకు అడ్వాన్స్ ఇచ్చింది. అయితే బ్యాంకుల్లో రైతులు తీసుకున్న మొత్తాలను చెల్లించి వారికి మిగిలిన అడ్వాన్స్ ఇవ్వడం గమనార్హం. ఈ క్రమంలో వారికి భవిష్యత్‌లో లీజు కింద తక్కువ ఆదాయం వస్తుంది. తద్వారా బాధిత రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. మరోవైపు బ్యాంకుల్లో ఉన్న క్రాప్ లోన్లను కూడా కంపెనీయే చెల్లించి మిగిలిన సొమ్మును పదేళ్లకు అడ్వాన్స్‌గా ఇచ్చినట్లు తెలుస్తోంది. బ్యాంకుల్లో అప్పు లేని వారికి మాత్రం రెండేళ్ల అడ్వాన్స్‌లను చెల్లించింది.
రైతుల డిమాండ్లు
ఎకరాకు సంవత్సరానికి రూ.50 వేలు ఇవ్వాలి. ఏడాదికి 15 శాతం పెంచాలి.
లీజ్ ఒప్పందంలో ఉన్న మార్టిగేజ్, లీజు హక్కులను ఇతరులకు బదిలీ చేసే నిబంధనలను పూర్తిగా తొలగించాలి.
ప్రస్తుతం ఉన్న 29 సంవత్సరాల 11 నెలల లీజు కాలన్ని గరిష్టంగా 10 సంవత్సరాలకు పరిమితం చేయాలి.
రైతుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ఒకేసారి 10 లేదా 20 సంవత్సరాల లీజు మొత్తం చెల్లించాలి.
రైతు–కంపెనీ మధ్య జరిగే లీజు ఒప్పందాలకు ఆర్‌డీఓ లేదా కలెక్టర్ మధ్యవర్తిగా ఉండాలి.
రైతుకు ఏదైనా వివాదం లేదా సమస్య వస్తే ఆ కేసుల విచారణ పత్తికొండ సివిల్ కోర్టు పరిధిలోనే జరిగేలా చర్యలు తీసుకోవాలి.
ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వర్తింపజేయాలి.


