నంద్యాల(అర్బన్): ఉమ్మడి జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్, జూన్‌లో దాదాపు 2 లక్షల హెక్టార్లలో పత్తి సాగైందని ఆర్‌ఏఆర్‌ఎస్ పత్తి కీటక శాస్త్రవేత్త శివరామకృష్ణ తెలిపారు. ఏప్రిల్‌లో సాగు చేసిన పత్తి ప్రస్తుతం కాయ, పక్వ దశలో ఉందని, వీటిని గులాబీ పురుగు ఆశించిందన్నారు. ఎకరాకు నాలుగు లింగాకర్షక బుట్టలు ఉంచి పురుగు ఉద్ధృతిని కనిపెట్టాలన్నారు. పురుగు ఆర్థిక నష్టపరిమితి దాటిన వెంటనే ప్రొఫినోపాస్ 500 మి.లీ, ఫైరిడాలిల్ 750 మి.లీ ఎకరాకు లీటరు నీటిని కలిపి పిచికారీ చేయాలన్నారు. జూన్ నెలలో విత్తిన పత్తి బెట్టతో ఎండిపోయే దశలో ఉందన్నారు. పంటను కాపాడుకునేందుకు 19–19–19 పోషక మందును 10 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. ప్రస్తుతం అధిక గాలిలోని తేమ శాతం వల్ల పచ్చదోమ ఉద్ధృతి పెరుగుతుందని, దీని నివారణకు డైనేటో ఫ్యూరాన్, ఫ్లోనిక్ అమైడ్ మందును ఎకరానికి 60 గ్రాములు 200 లీటర్ల నీటితో కలిపి పిచికారీ చేయాలన్నారు. ఆగస్టు మొదటి వారం వరకు సరైన వర్షపాతం నమోదైతేనే పత్తి విత్తుకోవాలని, ప్రస్తుతం పత్తి విత్తుకొనే రైతులు మధ్యకాలిక, స్వల్పకాలిక రకాలను సాగు చేసుకోవాలన్నారు. పత్తిలో అంతర్‌పంటలుగా కంది, జొన్న, సోయాచిక్కుడును విత్తుకుంటే లాభాలు గడించవచ్చన్నారు.


