ఆత్మకూరురూరల్: ఆత్మకూరు డీఎస్పీ కార్యాలయంలో హోంగార్డ్‌గా విధులు నిర్వహిస్తున్న నాగేశ్వరరావు ఈ నెల 22వ తేది నుంచి కనిపించడం లేదని ఆయన భార్య మంజుల 27వ తేదీన పాములపాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ తిరుపాలు అదే రోజు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఆలస్యంగా తెలిసింది. పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్ ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 22న తన కుమారుడిని గుంటూరులో కాలేజీలో చేర్పించేందుకు నాగేశ్వరరావు వెళ్లాడు. అదేరోజు విజయవాడలోని దుర్గమ్మ దర్శనానికి వెళుతున్నట్లు భార్యకు ఫోన్‌లో తెలిపాడు. తరువాత నుంచి ఆచూకీ లేదు. ఫోన్ స్విచాఫ్ వస్తోంది. దీంతో ఆయన భార్య మంజుల పోలీసులను ఆశ్రయించింది. పాములపాడు మండలం వేంపెంటకు చెందిన నాగేశ్వరరావు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా విచారణ చేపట్టగా ఆయన విశాఖపట్నం లొకేషన్‌లో ఉన్నట్లు తెలిసింది. అక్కడ వెతికేందుకు వెళ్లినట్లు తెలిసింది.
విద్యుదాఘాతంతో
వ్యక్తి మృతి
దేవనకొండ: విద్యుదాఘాతానికి గురై యువకుడు మృతి చెందాడు. వివరాలు.. మండలంలోని గుడిమిరాళ్ల గ్రామానికి చెందిన బోయ మునిరంగడు (35) సొంత ఊరిలో కరెంట్ మెకానిక్ పనిచేస్తూ జీవిస్తున్నాడు. పొరుగు ఊరైన బుర్రకుంటలో బుధవారం పొలానికి విద్యుత్ మోటార్ బిగించే క్రమంలో విద్యుత్ షాక్ గురయ్యాడు. అపస్మారకస్థితిలో పడి ఉన్న అతన్ని దేవనకొండ ప్రాథమిక ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలో మృతిచెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
బనగానపల్లెలో
చైన్‌స్నాచింగ్
బనగానపల్లె: బనగానపల్లె పట్టణంలోని 33/11 కేవీ సబ్‌స్టేషన్ సమీపంలోని కాలనీలో బుధవారం ఉదయం ఇంటి బయట నారాయణమ్మ అనే వృద్ధురాలు చెత్త ఉడ్చుతుండగా గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చి ఆమె మెడలోని సుమారు రూ.4 లక్షల విలువైన మూడు తులాల బంగారు చైన్‌ను అపహరించారు. బాధితురాలు తెలిపిన వివరాల మేరకు.. తాను పనిలో ఉండగా ఒక వ్యక్తి దగ్గరకు వచ్చి మెడలోని గొలుసును బలవంతంగా లాక్కున్నాడని, కొద్ది దూరంలో బైక్‌పై ఉన్న మరో వ్యక్తితో కలిసి ఇద్దరూ పరారయ్యారని చెప్పారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపారు. ఇన్‌చార్జ్ సీఐ మంజునాథ్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆటో డ్రైవర్ నిజాయితీ
డోన్ టౌన్: ప్రయాణికురాలు తన ఆటోలో మరిచిపోయిన బ్యాగును వెంకటనాయునిపల్లెకు చెందిన ఆటో డ్రైవర్ మధు పట్టణ పోలీసులకు అందించి నిజాయితీ చాటుకున్నారు. వివరాలు.. కర్నూలుకు చెందిన పి.రాధ పాతపేట జెడ్పీ హైస్కూల్లో టీచరుగా విధులు నిర్వహిస్తోంది. బుధవారం డోన్ కొత్త బస్టాండ్ వద్ద ఆటో ఎక్కి పాతపేటలో దిగివెళ్లేటప్పుడు బ్యాగును ఆటోలో మరచిపోయారు. కొద్ది సేపటి తరువాత బ్యాగును గుర్తించిన ఆటో డ్రైవర్ మధు పట్టణ పోలీసుస్టేషన్‌లో అప్పజెప్పగా బ్యాగులో ఉన్న గుర్తింపు కార్డు ద్వారా ప్రయాణికురాలు రాధగా గుర్తించారు. అలాగే బ్యాగులో ఏటీఎం కార్డులు, వెండి పట్టీలు, రూ.1500 నగదు ఉన్నాయి. సీఐ ఇంతియాజ్ బాషా ఆమెను పిలిపించి బ్యాగును అప్పజెప్పారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ మధు నిజాయితీని సీఐ అభినందించారు. ఎస్‌ఐలు, పోలీసు సిబ్బంది ఉన్నారు.
కర్నూలు: మొబైల్ సిమ్‌కార్డులు ఉచితంగా ఇస్తామంటే నమ్మొద్దని ఎస్పీ విక్రాంత్ పాటిల్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బహుమతులు, ప్రభుత్వ పథకాలు, ఇతర ఆకర్షణీయ ఆఫర్ల పేరుతో కొందరు మోసగాళ్లు ప్రజల వ్యక్తిగత, బ్యాంకు వివరాలు సేకరించి మోసాలకు పాల్పడుతున్నారని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని బుధవారం విడుదల చేసిన ప్రకటనలో సూచించారు. సిమ్ కార్డులను టెలికాం సంస్థల అధికారిక కార్యాలయాలు లేదా గుర్తింపు విక్రయ కేంద్రాల్లో మాత్రమే పొందాలన్నారు. ఉచిత సిమ్ కార్డులు జారీ చేస్తామని చెప్పే అపరిచిత వ్యక్తులు, ఏజెంట్లను నమ్మవద్దని, ఎక్కడ పడితే అక్కడ అనధికారిక వ్యక్తుల వద్ద సిమ్ కార్డులు కొనుగోలు చేయవద్దన్నారు. గోప్యమైన సమాచారాన్ని అడిగితే ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వొద్దని హెచ్చరించారు.


