● ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలి ● పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
పత్తికొండ: భూములు తీసుకుని అగ్రిమెంట్ చేసుకునే సమయంలో రైతులకు నిబంధనలు వివరించకుండా మోసం చేశారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. మోసపోయిన అన్నదాతలకు చంద్రబాబు ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సోలార్ కంపెనీ చేతిలో మోసపోయిన వైనంపై హోసూరు, పెద్దహుల్తి గ్రామాల రైతులు బుధవారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆమె దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. హోసూరు, పెద్దహుల్తి గ్రామాల్లో దాదాపు 700 మంది రైతుల నుంచి 1800 ఎకరాలు టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం లీజుకు తీసుకుందన్నారు. అయితే లీజుకు సంబంధించిన విషయంపై రైతులతో అగ్రిమెంట్ చేసుకునే సమయంలో నిబంధనలను గోప్యతగా ఉంచి మోసం చేశారన్నారు. భూమిని 29 ఏళ్ల 11 నెలలు పాటు లీజ్‌కు తీసుకొని రైతులకు నగదు చెల్లింపు విషయంలో ఒక్కో రైతుకు ఒక రకంగా అడ్వాన్స్ చెల్లించారని తెలిపారు. కొంత మందికి రెండేళ్లకు నగదు చెల్లిస్తే మరికొందరికి పదేళ్ల లీజు మొత్తం చెల్లించి మోసం చేశారని మండిపడ్డారు. రైతులు ఇచ్చిన భూములను కంపెనీ అవసరాల కోసం కాకుండా వాటిని తాకట్టు పెట్టి రుణం తీసుకుంటున్నట్లు తెలపడం దారుణమన్నారు. ఇలాగైతే భవిష్యత్‌లో భూములపై హక్కులు కోల్పోతామని రైతులు అందోళన చెందుతున్నారన్నారు. గురువా రం హోసూరు గ్రామ పర్యటనకు వస్తున్న విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రైతులకు న్యాయం చే యాలని కోరారు. లేనిపక్షంలో రైతుల పక్షాన నిలిచి అందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ అనుబంధ సంఘాల నాయకు లు శ్రీరంగడు, బాబుల్‌రెడ్డి, నారాయణ్‌దాస్, భా స్కర్‌నాయక్, బనగాని శ్రీనువాసులు, నరసింహాచారి, నాగరాజు, జిట్టా నాగేష్, కేశవరెడ్డి, శ్రీరాములు, నాగరాజు, కృష్ణారెడ్డి, రంగనాయక్, నాగిరెడ్డి, వాసుదేవనాయుడు, రవిరెడ్డి పాల్గొన్నారు.


