రైతులకు రూ.120 కోట్ల నష్టం!
కర్నూలు(అగ్రికల్చర్): వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వీరిని ఉదారంగా ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఉచితల పంటల బీమాకు స్వస్తి చెప్పి ప్రీమియం చెల్లించాలని అధికారులతో విస్తృతంగా ప్రచారం చేయింది. పంటలు కోల్పోయామని పరిహారం వస్తుందని అప్పు చేసి డబ్బులు చెల్లించిన రైతులకు శోకమే మిగిలింది. పంట రుణం తీసుకుంటే బీమా వర్తించదని తీరిగ్గా చెప్పడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. సాధారణంగా పంటల బీమా అమలులో బ్యాంకులదే కీలక పాత్ర. నోటిఫై చేసిన పంటలకు బ్యాంకుల నుంచి పంట రుణాలు తీసుకునే రైతులందరికీ బీమా వర్తింప చేయాల్సిన అవసరం ఉంది. రైతులకు ఇచ్చే పంట రుణంలో ప్రీమియం డబ్బు తీసుకుని నిర్దిష్ట గడువులోపు ప్రీమియాన్ని బీమా కంపెనీలకు చెల్లించాల్సి ఉంది. అయితే ఏ బ్యాంకు కూడా ఇలా చేయలేదు. దీంతో బ్యాంకుల నుంచి పంట రుణాలు పొందిన రైతులు మీసేవా కేంద్రాలు, కామన్ సర్వీస్ సెంటర్లు తదితర వాటిల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో 95 శాతం మంది రైతులు ప్రీమియం చెల్లించారు. ప్రీమియం చెల్లించిన తర్వాత బ్యాంకుల్లో పంట రుణం తీసుకొని ఉంటే నాన్‌లోన్ కింద ప్రీమియం చెల్లించిన వారికి బీమా వర్తించదనే విషయం బయటికి వచ్చింది. ఈ విషయాన్ని వాతావరణ ఆధారిత బీమా, ప్రధానమంత్రి ఫసల్ బీమా అమలు చేస్తున్న కంపెనీలు, అధికారులు సైతం ధ్రువీకరిస్తున్నారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం
పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. కనీసం వ్యవసాయ యంత్రాంగం కూడా రైతులకు అవగాహన కల్పించలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 6.75 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 3 లక్షల మంది రైతులకు రూ.5000 కోట్ల పంట రుణాలు పంపిణీ చేశారు. పంటల బీమా కింద నోటిఫై చేసిన వాటిపైనే రుణాలన్నీ తీసుకున్నారు. వీరంతా ప్రీమియం చెల్లించడంతో బీమా కంపెనీలకు రూ.120 కోట్లు సమకూరాయి. అయితే వారికి పంటల బీమా దక్కని పరిస్థితి ఏర్పడింది. బ్యాంకులు రుణాలు తీసుకున్న వారికీ పంటల బీమా అమలు చేసి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. రైతుల కష్టాలను, కరువును పట్టించుకోకుండా బ్యాంకులు చేతులెత్తేయడంతో రైతులు నాన్‌లోన్ కింద ప్రీమియం చెల్లిస్తున్నారు. బ్యాంకుల్లో పంట రుణం ఉందనే సాకుతో వాతావరణ బీమా, పీఎంఎఫ్‌బీవై అమలు చేస్తున్న కంపెనీలు పరిహారాన్ని ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.
కాసుల పంట
పంటల బీమా కారణంగా మీ సేవ, కామన్ సర్వీస్ సెంటర్లకు కాసుల పంట పండుతోంది. ఒక్కో రైతు రెండు, మూడు దరఖాస్తుల ద్వారా ప్రీమియం చెల్లిస్తున్నారు. ఒక్కో దరఖాస్తుకు రూ.300 వసూలు చేస్తున్నారు. ఆరు రోజుల్లోనే మీ సేవా సెంటర్ల, కామన్ సర్వీస్ సెంటర్లకు రూ.4.33 కోట్లు సమకూరాయి.
నంద్యాల జిల్లాలో..
పంటల బీమాలో లోపాలు
పంట రుణం తీసుకుంటే
బీమా వర్తించదు
ధ్రువీకరించిన బీమా కంపెనీలు,
వ్యవసాయ యంత్రాంగం
పంట మార్పు సర్టిఫికెట్ పొందాలంటే
ఎకరాకు రూ.లక్ష చెల్లించాల్సిందే
సర్టిఫికెట్ సమర్పించకపోతే
బీమా కోల్పోయినట్లే!
ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం నాటికి కర్నూలు జిల్లాలో 87,974 మంది రైతులు ప్రీమియం చెల్లించారు. వాతావరణ బీమా కింద లోన్ ఫార్మర్స్ నుంచి 8,042, నాన్‌లోన్ ఫార్మర్స్ నుంచి 87,820 దరఖాస్తుల ద్వారా ప్రీమియం వచ్చింది. పీఎంఎఫ్‌బీవై కింద 30,556 మంది రైతులు ప్రీమియం చెల్లించారు. ఇందులో లోన్ ఫార్మర్స్ కింద 1,225, నాన్‌లోన్ కింద 49,143 దరఖాస్తుల ద్వారా ప్రీమియం చెల్లించారు.
నంద్యాల జిల్లాలో 7,163 మంది రైతులు ప్రీమియం చెల్లించారు. వాతావరణ బీమా కింద 4,745 మంది రైతులు ప్రీమియం చెల్లించారు. లోన్ ఫార్మర్స్ 30, నాన్‌లోన్ ఫార్మర్స్ 3,452 దరఖాస్తుల ద్వారా ప్రీమియం చెల్లించారు. పీఎంఎఫ్‌బీవై కింద 2418 మంది రైతులు ప్రీమియం చెల్లించారు. ఇందులో లోన్ ఫార్మర్స్ 17, నాన్ లోన్ ఫార్మర్స్ 9,199 దరఖాస్తులు ఉన్నాయి.
ప్రీమియం చెల్లించిన దరఖాస్తులను పరిశీలిస్తే కర్నూలు జిల్లాలో నాన్‌లోన్ ఫార్మర్స్‌కు సంబంధించినవి 90 శాతం పైగా ఉన్నాయి. నంద్యాల జిల్లాలో 99 శాతం వరకు ఉన్నాయి. నాన్‌లోన్ కింద ఉన్న దరఖాస్తుల్లో 90 శాతం రైతులు బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న వారే.


