● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి
ఆలూరు రూరల్: ఉచిత పంటల బీమా పథకాన్ని ఎత్తేసి చంద్రబాబు ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి విమర్శించారు. స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్‌లో పంటల బీమా కోసం రైతుల నుంచి వేల రూపాయలు వసూలు చేయడం దారుణం అన్నారు. అప్పులు చేసి అన్నదాతలు బీమా ప్రీమియం చెల్లిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉంటే రాష్ట్రంలో పంటలు పండబోవని, గతేడాది అధిక వర్షాలతో పంటలు కుళ్లిపోయాయన్నారు. అయినా పత్తి మిరప, టమాట, పొగాకు, ఉల్లి పంటలకు పరిహారం ఇవ్వలేదన్నారు. ఆలూరు నియోజకవర్గంలోని 75 శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారన్నారు. వర్షాభావ పరిస్థితులతో గ్రామాలు విడిచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులు సంతోషంగా లేరన్నారు. పండించిన పంటకు కనీస మద్దతు ధర లభించడం లేదన్నారు. ఇన్సూరెన్స్ పేరిట రైతులు చెల్లిస్తున్న నగదును తల్లికి వందనం పథకానికి అందిస్తున్నారని విమర్శించారు.
రైతుల బాంధువుడు వైఎస్ జగన్
మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రైతుల బాంధువుడిగా నిలిచారని ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. రైతులకు వెన్నుదన్నుగా నిలచి ఉచిత పంటల బీమా ఇచ్చారన్నారు. అప్పట్లో పంటలు నష్టపోయిన రైతులకు రూ.లక్షల్లో పరిహారం అందిందన్నారు. విలేకరుల సమావేశంలో పార్టీ మండల కన్వీనర్ మల్లికార్జున, నాయకులు రామాంజినేయులు, వెంకటేషులు, గుండయ్య, భాస్కర్, ఎల్లప్ప, ఉరుకుందు, నాగేంద్ర, వీరభద్రి, హనుమంతప్ప, నాగేష్, గజ్జలప్ప, రాజు, వరుణ్, గౌస్, రాజశేఖర్, సోము తదితరులు పాల్గొన్నారు.


