కర్నూలు: బాల్య వివాహాల నివారణ సామాజిక బాధ్యత అని ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. బాల్య వివాహాన్ని అడ్డుకుని మైనర్ బాలిక భవిష్యత్తును కాపాడటంలో కృషి చేసిన ఆదోనికి చెందిన శక్తి బృందం పోలీస్ కానిస్టేబుల్స్ రాజేశ్వరి, వీరాంజనేయులును జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఆదోని మండలం ఇస్వి గ్రామానికి చెందిన 8వ తరగతి బాలికకు బాల్య వివాహం జరిపించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం అందడంతో శక్తి బృందం పోలీస్ కానిస్టేబుళ్లు రాజేశ్వరి, వీరాంజనేయులు స్పందించారన్నారు. ఐసీడీఎస్, రెవెన్యూ, ఆరోగ్య శాఖ, గ్రామ సచివాలయ అధికారులతో సమన్వయం చేసి ఘటనా స్థలానికి చేరుకుని బాలిక కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ నిర్వహించి బాలిక భవిష్యత్తును కాపాడినట్లు ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు. ప్రజలు కూడా బాల్య వివాహాల సమాచారం తెలిసిన వెంటనే డయల్ 112కు లేదా చైల్డ్ లైన్ 1098కు తెలియజేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు. మహిళా పీఎస్ సీఐ మస్తాన్ వలి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


