కర్నూలు (టౌన్): వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధిగా విజయ కృష్ణను నియమించారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మంత్రాలయం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఆయనను అధికార ప్రతినిధిగా నియమిస్తూ గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
తుది దశకు డిజిటైజేషన్
కర్నూలు(సెంట్రల్): ‘సర్’ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటైజేషన్ తుది దశకు చేరుకుంది. జిల్లాలో కేవలం 356 ఫారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. పాణ్యంలో 189, మంత్రాలయంలో 167 ఫారాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని ఈనెల 24వ తేదీలోపు డిజిటైజేషన్ చేయడానికి సమయం ఉంది.
వీఆర్‌లోని 14 మంది
ఏఎస్‌ఐలకు పోస్టింగులు
కర్నూలు: జిల్లా పోలీసు శాఖలో వీఆర్‌లో ఉన్న 14 మంది ఏఎస్‌ఐలకు పోస్టింగులు దక్కాయి. ఈ మేరకు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే విధుల్లో చేరిపోవాలని అందులో పేర్కొన్నారు.
ఎల్‌ఎల్‌బీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల
కర్నూలు కల్చరల్: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో ఫిబ్రవరి/మార్చి నెలల్లో నిర్వహించిన ఎల్‌ఎల్‌బీ 3, 5 సవత్సరాల కోర్సులకు సంబంధించి 1, 3, 5, 7, 9 సెమిస్టర్ల పరీక్షల రీ వాల్యుయేషన్ ఫలితాలు విడుదలయ్యాయి. వర్సిటీ వైస్‌ఛాన్సలర్ ప్రొఫెసర్ వి.వెంకట బసవరావు ఆదేశాల మేరకు ఫలితాలు విడుదల చేసినట్లు వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఫలితాలు htt ps://rayalaseemauniversity.ac.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు.
పూజ్యాయ..
రాఘవేంద్రాయ!
మంత్రాలయం: పూజ్యాయ.. రాఘవేంద్రాయ శ్లోకంతో గురువారం భక్తులు శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్నారు. గురువారం ప్రత్యేకవారం కావడంతో వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. తుంగభద్ర నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గ్రామదేవత మంచాలమ్మకు పూజలు చేశారు. అనంతరం మూల బృందవనంను దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. శ్రీమఠం ప్రాంగణంలో ఊంజల మండపం నుంచి మంగళవాయిద్యాలతో బంగారు పల్లకీలో మూలబృందవనం మూర్తిని ఊరేగించారు. మధ్వకారిడార్, కల్పతర క్యూలైన్లు, అన్నపూర్ణ భోజనశాల, పరిమళ ప్రసాదం కౌంటర్లలో భక్తుల కోలాహలం నెలకొంది. అధిక సంఖ్యలో భక్తుల రాకతో మూల బృందావన దర్శనానికి నాలుగు గంటలకు పైగా సమయం పట్టింది.
జిల్లాలో
100 సీజనల్ హాస్టళ్లు
కర్నూలు(సెంట్రల్): వలస వెళ్లిన కుటుంబాలకు చెందిన పిల్లల కోసం ప్రభుత్వం 100 సీజనల్ హాస్టళ్లకు ఆమోదం తెలిపిందని, త్వరలోనే వాటిని ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి తెలిపారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో గురువారం ఏర్పాటు చేసిన ప్రెస్‌కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల స్థానంలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియమాకానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. జిల్లాలో కొత్తగా 12 కేజీబీవీలు, 4 బీసీ వెల్ఫేర్, 7 సోషల్ వెల్ఫేర్ పాఠశాలలు ప్రారంభించాలని ప్రభుత్వానికి సూచించినట్లు తెలిపారు. మంత్రాలయం, పత్తికొండలకు రెండు ఎంజేపీ పాఠశాలలు మంజూరైనట్లు చెప్పారు. మనబడి– మన భవిష్యత్ కార్యక్రమంలో భాగంగా అదనపు తరగతి గదుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లను చాలా వరకు పంపిణీ చేశామని, కొన్ని చోట్లా ఇంకా ఇవ్వాల్సి ఉందన్నారు. జిల్లాలో చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉన్న 1142 భూ సమస్యలను పరిష్కరించామన్నారు. ఇటీవల 120 మందికి కారుణ్య నియమకాల ఉత్వర్వులు ఇచ్చామన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో జూలై 24న మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్‌ను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో డీఈఓ జి.సుధాకర్, ఏపీసీ లోకరాజు పాల్గొన్నారు.


