కర్నూలు(సెంట్రల్): జిల్లాలో నీటి నాణ్యత పర్యవేక్షణ ప్రయోగశాలలు సమర్థవంతంగా పని చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో ప్రయోగశాలల అభివృద్ధి సంఘం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రస్తుతం ప్రయోగశాలల్లో సిబ్బంది కొరత, బడ్జెట్ పరిమితులు, నిర్వహణకు సంబంధించిన సమస్యలు ఉన్నాయని వైద్యాధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా తగిన ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. ఆర్‌ఓ వాటర్ ప్లాంట్లు, వ్యక్తిగత గృహాల నుంచి నీటి నాణ్యత కోసం వసూలు చేస్తున్న రూ.380 సరిపోవడంలేదన్నారు. రీజినల్ ఫుడ్ ల్యాబ్‌ను స్టేట్ ఫుడ్ ల్యాబ్‌గా అప్‌గ్రేడ్ చేశారని, ఏపీఎంఎస్‌ఐడీసీకి పరిపాలనా అనుమతులు, లిఖిత పూర్వక ఆదేశాలు పూర్తిగా అందకపోవడంతో పనుల్లో జాప్యం జరుగుతోందన్నారు. సమావేశంలో సివిల్ సర్జన్ బ్యాక్టీరియాలజిస్టు డాక్టర్ ఓ ప్రభావతిదేవి, సభ్యులు డాక్టర్ గోవిందరెడ్డి, ఎస్.మురళీ, శారద, అనంత రాజేంద్రప్రసాద్, డాక్టర్ రమేష్‌కుమార్, డాక్టర్ భాస్కర్ పాల్గొన్నారు.


