పిడికిలి బిగించిన అంగన్‌వాడీలు | - | Sakshi
Sakshi News home page

పిడికిలి బిగించిన అంగన్‌వాడీలు

Jul 11 2026 7:07 AM | Updated on Jul 11 2026 7:07 AM

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా

కర్నూలు(సెంట్రల్‌): ఆటపాటలతో చిన్నారులకు అక్షరాలు నేర్పించే అంగన్‌వాడీ కార్యకర్తలు పిడికిలి బిగించారు. కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం కలెక్టరేట్‌ ఎదుట పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌హెల్పర్స్‌ యూనియన్‌ జల్లా అధ్యక్షురాలు బాలదర్గమ్మ అధ్యక్షతన నిర్వహించిన ధర్నాకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో అంగన్‌వాడీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ అంజిబాబు, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్‌ పి.నిర్మల మాట్లాడారు. అంగన్‌వాడీలతో ప్రభుత్వం శ్రమదోపిడీ చేయించుకొంటోందని విమర్శించారు. కేవలం రూ.11 వేల జీతంతో వారు ఎలా బతకాలని ప్రశ్నించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలి ఆదేశాలు ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వం లెక్కచేయకపోవడం అన్యాయమన్నారు. అంగన్‌వాడీలకు తీవ్ర మానసిక ఒత్తిడి కలిగిస్తున్న నవ చేతన్‌ యాప్‌ను పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. గ్రాట్యూటీ పూర్తిగా అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న టీఏ బిల్లులను వెంటనే చెల్లించాలని కోరారు. ‘సర్‌’ డ్యూటీ కోసం అంగన్‌వాడీలను ఇబ్బంది పెట్టడం తగదన్నారు. వెంటనే పీఎఫ్‌, ఈఎస్‌ఐ సదుపాయాలు కల్పించాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో 42 రోజులపాటు చేసిన సమ్మె కాలంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్నారు. అంగన్‌వాడీలను మానసికంగా వేధిస్తున్న ప్రభుత్వంపై పోరాటాలకు సిద్ధం కావాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు పీఎస్‌ రాధాకృష్ణ పిలుపునిచ్చారు. ఇటీవల పెద్దహోతూరులో అంగన్‌వాడీ కార్యకర్తను టీడీపీ నాయకుడు వేధించడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. ధర్నాలో నాయకులు ఎం.గోపాల్‌, ప్రభాకర్‌, అబ్దుల్‌ దేశాయ్‌, విజయ్‌, నగేష్‌, నరసింహులు, మహ్మద్‌ రఫీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement