కర్నూలు(అగ్రికల్చర్): ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయకపోవడంపై ప్రజల్లో పూర్తి స్థాయిలో వ్యతిరేకత వస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రతి నెలా నవరత్నాల పేరుతో ఏదో ఒక సంక్షేమ పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అయ్యేది. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండేవారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం రెండేళ్ల కాలంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఎలాంటి పథకాలు పూర్తిగా అమలు చేయలేదు. ప్రభుత్వ శాఖల పనితీరు, సంక్షేమ కార్యక్రమాలు అమలుపై మే, జూన్ నెలలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టమ్(ఐవీఆర్‌ఎస్) ద్వారా వచ్చే కాల్స్‌లో ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. పింఛన్లు, రేషన్ పంపిణీ, ఇసుక సరఫరా, చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్..తదితర వాటిపై ప్రజల్లో అసంతృప్తి వెల్లువెత్తుతోంది.
పింఛన్ల పంపిణీలో అక్రమాలు
ప్రతి నెలా 1, 2వ తేదీల్లో జరిగే పింఛన్ల పంపిణీలో అక్రమాలు జోరుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మే నెలకు సంబంధించి పింఛన్లు ఇవ్వడానికి డబ్బులు వసూలు చేశారా అనే దానికి 84.08 శాతం, జూన్ నెలకు సంబంధించి 79.80 శాతం మంది అవును అనే సమాధానం ఇచ్చారు. ఈ సమాధానం అధికార యంత్రాంగాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రభుత్వం నిర్వహించిన సర్వేలోనే ఇది వెల్లడి కావడం గమానార్హం. ఇంటి దగ్గరే పింఛన్లు ఇస్తున్నారా అనే ప్రశ్నకు మే నెలలో 8.25 శాతం, జూన్ నెలలో 13.23 శాతం లేదని సమాధానం ఇచ్చారు. ఎమ్మిగనూరు మండలం దేవిబెట్ట సచివాలయంలో 33.33 శాతం, కర్నూలు నగరపాలక సంస్థలోని గరీబ్ నగర్‌లో జీరో శాతం, తుగ్గలి మండలం మారెళ్లలో 25 శాతం, ఆదోని మండలం అరేకల్‌లో జీరో శాతం, ఎమ్మిగనూరు మండలం కందనాతి–2 సచివాలయంలో పరిధిలో 25 శాతం, మంత్రాయలం మండలం వగరూరు సచివాలయంలో సంతృప్తి స్థాయి తక్కువ ఉన్నట్లు తేలింది.
అందని ఉచిత విద్యుత్
ఈ ఏడాది ఏప్రిల్ నుంచి చేనేత కార్మికులకు 200 యూనిట్ల వరకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తోంది. ఇది ఎలా అమలవుతోందని ఐవీఆర్‌ఎస్ కాల్స్‌తో పాటు వివిధ రూపాల్లో ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం తీసుకుంటోంది. వివిధ మండలాల్లో సానూకూల ప్రజాభిప్రాయం తక్కువగా ఉన్నట్లు స్పష్టం అవుతోంది. సి. బెళగల్‌లో 50 శాతం, ఎమ్మిగనూరు రూరల్‌లో 70 శాతం, కృష్ణగిరిలో 66.67 శాతం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వంపై అసంతృప్తి స్థాయి ఎక్కువగా ఉండటంపై జిల్లా యంత్రాంగం ఆందోళనలో ఉంది.
ప్చ్.. పాలన బాగోలేదు!
చంద్రబాబు పాలన బాగోలేదని ఎఫ్‌లైన్ సర్వేలో ప్రజలు చెబుతున్నారు. కర్నూలు మండలంలో కేవలం 3 శాతం మంది మాత్రమే సంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మిగనూరు మండలంలో 3 శాతం, ఆస్పరిలో 2, దేవనకొండలో 2, హలహర్వి, కృష్ణగిరి మండలాల్లో 2 శాతం మాత్రమే సంతృప్తి స్థాయి ఉన్నట్లు అధికారులు చేపట్టిన సర్వే చెబుతోంది. చంద్రబాబు ప్రభుత్వంపై స్వయం సహాయక సంఘాల మహిళలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆదోని, మంత్రాలయం మండలాల్లో ఐదు, హాలహర్వి, పత్తికొండ మండలాల్లో నాలుగు, సి.బెళగల్, కోడుమూరు, కృష్ణగిరి, ఓర్వకల్లు, ఎమ్మిగనూరు మండలాల్లో మూడేసి గ్రామాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలు వంద శాతం అసంతృప్తి వ్యక్తం చేశారు. మోప్మాకు సంబంధించి కల్లూరు, వెల్దుర్తి, కల్లూరు, గోనెగండ్ల, కర్నూలు, కోడుమూరు, పత్తికొండ మండలాల్లో 39 గ్రామాల్లో పాజిటివ్ రేటు జీరో ఉన్నట్లు స్పష్టం అవుతోంది.
టీడీపీ నేతల ఆధీనంలో ఇసుక రీచ్‌లు!
ఇసుక సరఫరాలో 69 శాతం మంది మాత్రమే సానుకూలంగా అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కొత్తకోట రీచ్‌లో 3.50 శాతం మాత్రమే సంతృప్తి స్థాయి ఉన్నట్లు వెల్లడవుతోంది. నాగలదిన్నె స్టాకు పాయింట్‌లో సంతృప్తి స్థాయి జీరో ఉన్నట్లు తేలింది. కొత్తకోటలో 3 శాతం, కే.సింగవరంలో 3 శాతం పల్లెదొడ్డిలో 3.50 శాతం మాత్రమే సంతృప్తి స్థాయి ఉన్నట్లు జిల్లా యంత్రాంగం ఇచ్చిన రిపోర్టు ద్వారానే వెల్లడవుతోంది. ఇసుక సరఫరాలో అవినీతి రాజ్యమేలుతున్నట్లు నిర్ధారణ అవుతోంది. ఇసుక రీచ్‌లు టీడీపీ నేతల కంట్రోల్‌లో ఉండటం వల్లనే ప్రజల్లో అసంతృప్తి వెల్లవెత్తుతోంది.
పింఛన్ల పంపిణీలో అవకతవకలు
ఇసుక సరఫరా పేరిట దోపిడీ
చేనేతలకు అందని
విద్యుత్ సబ్సిడీ
ఐవీఆర్‌ఎస్ సర్వేలో వెల్లడి


