విద్యార్థుల భవిష్యత్తుకు ‘నవోదయ’ం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థుల భవిష్యత్తుకు ‘నవోదయ’ం

Jul 10 2026 7:58 AM | Updated on Jul 10 2026 7:58 AM

పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ

6వ తరగతిలో ప్రవేశానికి

దరఖాస్తుల ఆహ్వానం

సీటు సాధిస్తే ఇంటర్‌ వరకు

ఉచిత విద్య

ఎమ్మిగనూరు సెంట్రల్‌: జవహర్‌ నవోదయ విద్యాలయం.. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుపుతున్న ఈ పాఠశాలలో ఉత్తమ విద్యా బోధన అందుతోంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్యనందించేందుకు 1986లో దీనిని స్థాపించారు. ఈ విద్యాలయంలో సీటు వచ్చిందంటే చాలు తమ బిడ్డ భవిత బంగారమేనని తల్లిదండ్రులు భావిస్తున్నారు. నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశానికి సంబంధించిన పరీక్ష ప్రకటన విడుదలైంది. కర్నూలు, నంద్యాల జిల్లాకు చెందిన విద్యార్థులు జూలై 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

సీబీఎస్‌ఈ సిలబస్‌.. నాణ్యమైన విద్య

ఆరో తరగతిలో ప్రవేశం పొందితే ఇంటర్‌ మీడియట్‌ వరకు ఉచితంగా విద్య అందిస్తారు. ఆరో తరగతి నుంచి కంప్యూటర్‌ విద్య బోధిస్తారు. సీబీఎస్‌ఈ తరహాలో బోధన ఉంటుంది. ఆధునాతన వసతులతో కూడిన గ్రంథాలయం, చక్కటి హాస్టల్‌ వసతి, నాణ్యమైన భోజనం అందిస్తారు. ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్‌, రాగిమాల్ట్‌ వంటివి ఇస్తారు. ఎన్‌సీసీ, స్కౌట్‌ అండ్‌ గైడ్‌, క్రీడలు, భరతనాట్యం, కూచిపూడి, కరాటే వంటి వాటిలో ప్రత్యేక శిక్షణ ఇస్తారు. విద్యార్థుల భద్రత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు స్టాఫ్‌ నర్స్‌ను నియమించారు. ప్రతి ఏటా పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తూ బనవాసి జవహర్‌ నవోదయ విద్యాలయం విద్యార్థులు ప్రతిభ చాటుతున్నారు. అంతేకాకుండా ఇంటర్‌ మీడియెట్‌ విద్యార్థులకు జేఈఈ లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌ అవకాశం ఇక్కడ మరో ప్రత్యేకత.

విద్యాలయంలో ప్రవేశాల పరీక్ష, ఎంపిక పూర్తిగా పారదర్శకంగా జరుగుతుంది. దళారులను నమ్మి మోసపోవద్దు. దరఖాస్తు, ప్రవేశ పరీక్ష, ఎంపిక ప్రక్రియ పూర్తిగా ఆన్‌లైన్‌లో ఉంటుంది. ప్రవేశ పరీక్షపై భయం వీడి కష్టపడి చదివితే విద్యార్థులు సులువుగా ప్రవేశం పొందవచ్చు. చివరి తేదీ వరకు వేచి చూడకుండా వీలైనంత త్వరగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి.

– ఇ.పద్మావతి, ప్రిన్సిపాల్‌, బనవాసి నవోదయ

రిజర్వేషన్లు ఇలా..

పాఠశాలలో ఆరో తరగతిలో 80 సీట్లు ఉన్నాయి. వీటిలో 75 శాతం గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, 25 శాతం పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు. ఇందులో 15 శాతం ఎస్సీ, 7.5 శాతం ఎస్టీ, 3 శాతం దివ్యాంగులకు, బాలికలకు 1/3 వంతు రిజర్వేషన్‌ అమలు చేస్తారు. విద్యార్థి ఫొటో, సంతకం, తల్లి, తండ్రి, సంరక్షుకుడి సంతకంతో దరఖాస్తులు సమర్పించాలి. ఆధార్‌కార్డు తప్పనిసరి. తహసీల్దారు కార్యాలయం నుంచి నివాస ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం కూడా సమర్పించాలి.

జూలై 31వ తేదీలోపు దరఖాస్తులను

ఆన్‌లైన్‌లో సమర్పించాలి.

ప్రవేశ పరీక్షను నవంబర్‌ 28వ తేదీన

నిర్వహిస్తారు.

విద్యార్థులు 3, 4వ తరగతులను ప్రభుత్వం

లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన

పాఠశాలలో ఉత్తీర్ణులై ఉండాలి.

ప్రస్తుతం 5వ తరగతి చదువుతూ ఉండాలి.

విద్యార్థులు తేదీ 01–05–2015 నుంచి

31–07–2017 మధ్య జన్మించి ఉండాలి.

రెండోసారి పరీక్ష రాసినవారికి

ప్రవేశం కల్పించరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement