క్యూఆర్ కోడ్‌తో
కోడ్‌తో మందుల వివరాలు తెలుస్తాయి
● ప్రతి ఔషధంపై క్యూ ఆర్ కోడ్ తప్పనిసరి ● స్కాన్ చేస్తే కళ్ల ముందు మందుల వివరాలు
మందుల గుట్టురట్టు
కర్నూలు(హాస్పిటల్): ప్రస్తుతం మందుల మాయాజాలం నడుస్తోంది. ఏది అసలో, ఏది నకిలీ మందో తెలియని పరిస్థితి నెలకొంది. ఏది మంచి మందో, ఏది సరైనది కాదో అర్థంకాని స్థితిలో మార్కెట్ ఉంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం క్యూ ఆర్ కోడ్‌ను తీసుకొచ్చింది. ప్రతి ఔషధంపై దాని మందుల తాలూకు వివరాలు ఉండేలా దానిని రూపొందించింది. ఈ మేరకు ఇకపై తయారయ్యే మందులపై తప్పనిసరిగా క్యూఆర్ కోడ్ ఉండాలని ఆదేశాలు జారీ చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1,800 రిటైల్ మెడికల్‌షాపులు, వెయ్యి దాకా హోల్‌సేల్ మెడికల్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రతి నెలా కోట్లాది రూపాయల వ్యాపారం జరుగుతోంది. ప్రస్తుతం ఫార్మారంగంలో వచ్చిన గణనీయమైన మార్పులు, పోటీ కారణంగా అనేక రకాల నకిలీ మందులు అచ్చు బ్రాండెడ్ మందుల రూపంలో పుట్టుకొస్తున్నాయి. దీనికితోడు ఊరు, పేరు లేని మందుల కంపెనీలు తయారు చేసే మందులూ మార్కెట్‌లో కొల్లలుగా ఉన్నాయి. లాభాలు అధికంగా ఉండటంతో అధిక శాతం వైద్యులు వారికి తక్కువ ధరకు లభించే ఎక్కువ లాభాలను ఇచ్చే ప్రాపగండ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల మందులను విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఏ మందులో ఎంత మోతాదులో మందు ఉంది, అసలు మందు ఉందా లేదా, ఏది నకిలీ, ఏది అసలు తెలుసుకోవాలంటే కష్టంగా మారిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో క్యూ ఆర్ కోడ్ ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు అధికారులు. ఇటీవల కాలంలో అధికంగా విక్రయాలు జరిగే బీపీ, షుగర్, యాంటిబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, విటమిన్, అలర్జీ, దగ్గు, జలుబు, జ్వరం తదితర వ్యాధులను తగ్గించే మందులపై ఆయా కంపెనీలు క్యూ ఆర్ కోడ్‌ను ముద్రించి విక్రయిస్తున్నాయి. ప్రస్తుతం బహుళజాతి కంపెనీలు మాత్రమే వీటికి ప్రాధాన్యత ఇస్తుండగా త్వరలో ఇతర కంపెనీలు కూడా క్యూఆర్ కోడ్‌ను ముద్రించనున్నాయని వ్యాపారవర్గాలు చెబుతున్నాయి. నిర్ణీత గడువులోగా దేశంలోని అన్ని ఫార్మాకంపెనీలు అవి తయారు చేసే మందులపై తప్పనిసరిగా క్యూ ఆర్ కోడ్‌ను ముద్రించి వివరాలు నమోదు చేయాలని కేంద్రం ఆదేశించిన నేపథ్యంలో దీనికి ప్రాధాన్యత చేకూరింది.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన క్యూ ఆర్ కోడ్ విధానం వల్ల ఆయా మందుల వివరాలు అందులో తెలుస్తాయి. ఏ ఔషధం దేనికి పనిచేస్తుంది, అది ఎక్కడ తయారైంది, ఆ ప్రాంతం వివరాలు ఉంటాయి. ఔషధంలో మందు ఎంత మోతాదులో ఉంది, ఎలా వినియోగించాలో తెలుస్తుంది. ఇది రోగి ఆరోగ్య పరిరక్షణకు ఎంతో ఉపయోగపడుతుంది.
– హరిహరతేజ, ఏడీ, ఔషధ నియంత్రణ శాఖ, కర్నూలు
క్యూఆర్ కోడ్‌తో


