‘మధ్యాహ్న మెనూ’ విస్మరించడంపై ఆగ్రహం
కర్నూలు(సెంట్రల్): ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ సక్రమంగా లేదని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యుడు లక్ష్మిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రెండో రోజు ఆయన జిల్లాలోని పలు పాఠశాలలు, హాస్టళ్లు, ఎంఎల్‌ఎస్ పాయింట్లు, అంగన్‌వాడీ సెంటర్లను తనిఖీ చేశారు. వెల్దుర్తి మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే పాఠశాల, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలుర), కల్లూరు మండలం పెద్దటేకూరు ఐసీడీఎస్ సెంటర్‌లో నిర్దేశించిన దానికంటే కోడిగుడ్లు అధికంగా ఉండటం, వంటశాల శుభ్రంగా లేకపోవడం, స్టాక్ రిజిస్టర్ మెయింటెయిన్ చేయకపోవడంతో మెమో, షోకాజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. కర్నూలు బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ హాస్టల్‌లో 56 బియ్యం బ్యాగులు అధికంగా ఉండటం, మెనూ పాటించకపోవడంతో వార్డెన్‌కు మెమో జారీ చేయాలని ఆదేశించారు. అలాగే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల హాస్టల్‌లో సాంబారు తయారీలో శనగపిండి వాడటం, ఆహార పదార్థాలు రుచిగా లేకపోవడంతో అధికారులకు మెమో జారీ చేయించారు. కర్నూలులోని ఎంఎల్‌ఎస్ పాయింట్, వెల్దుర్తి కేజీబీవీ పాఠశాలలను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు. డీఎస్‌ఓ ఎం.రాజారఘువీర్, డీఎం వెంకటరాముడు, ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్, అసిస్టెంట్ కంట్రోలర్, లీగల్ మెట్రాలజీ అధికారి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.


