కార్మికుల ప్రాణం కంటే.. ‘అల్కాలీస్’ ప్రయోజనం ముఖ్యమా?
● కలెక్టరేట్ ఎదుట ధర్నా చేసిన
సీఐటీయూ నాయకులు
కర్నూలు(సెంట్రల్): టీజీవీ గ్రూపునకు చెందిన అల్కాలీస్ ఫ్యాక్టరీలో రెండు రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో గాయపడిన కార్మికుల వివరాలను బహిర్గతం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పీఎస్ రాధాకృష్ణ, ఎండీ అంజిబాబు డిమాండ్ చేశారు. కార్మికుల ప్రాణాలను కాపాడడం కంటే ఫ్యాక్టరీ ప్రయోజనాలను కాపాడేందుకే అధికారులు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం అన్యాయమన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో కలెక్టరేట్ గాంధీ విగ్రహం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. జనవరి 5న ఐదు గంటల సమయంలో ఫ్యాక్టరీలో క్లోరిన్ లీకై 22 మంది కార్మికులు అస్వస్థతకు గురై ఊపిరి పీల్చుకోలేక స్పృహ కోల్పోయి ప్రాణపాయ స్థితిలోకి వెళ్లిపోయారన్నారు. అయితే అధికారులు.. ప్రమాదంలో ఎంతమంది అస్వస్థతకు గురయ్యారు? వారికి ఎక్కడ వైద్యం అందించారన్న వివరాలను చెప్పలేదన్నారు. క్లోరిన్ పైపు లీకేజీతో విషవాయువు గొందిపర్ల, ఈ.తాండ్రపాడులను చుట్టుముట్టడంతో ఆయా గ్రామాల్లో అనేక మంది స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, వారికి యాజమాన్యమే సరైన వైద్యం అందించాల్సి ఉన్నా పట్టించుకోలేదన్నారు. క్లోరిన్ గ్యాస్ లీకేజీపై పీసీబీ, ఫ్యాక్టరీస్ ఆఫ్‌ఇన్‌స్పెక్టర్, లేబర్ అధికారులు స్పందించకపోవడం అన్యాయమన్నారు. యాజమాన్యం చెప్పినట్లు చేయడం అధికారులకు తగదన్నారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ కలుగజేసుకొని పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై విచారణకు ఆదేశించాలన్నారు. ధర్నాలో నాయకులు ఎం.గోపాల్. వై.నగేష్, షరీఫ్, రాఘవేంద్ర, హుస్సేనయ్య, తాండ్రపాడు సర్పంచ్ బాలపీరా పాల్గొన్నారు.


