● కేసీ కెనాల్‌లో దూకిన యువరైతు
అప్పుల బాధతో..
పాములపాడు: పంటలకు ధర లేక.. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఓ యువరైతు మనస్థాపం చెంది కేసీ కెనాల్‌లో దూకాడు. ఈనెల 6వ తేది రాత్రి ఈ సంఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు..మండలంలోని జూటూరు గ్రామ పంచాయతీ మజరా కోల్స్ ఆనందాపురం గ్రామానికి చెందిన యువరైతు వంశీ(21) తండ్రి చంద్రపాల్, తల్లి నాగమ్మతో కలిసి వ్యవసాయం చేసేవాడు. రెండేళ్ల నుంచి వ్యవసాయం కలిసి రావడం లేదు.దీనికితోడు 6 ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న, మినుము పండిస్తే సరైన ధర లభించలేదు. పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంతో చేసిన అప్పులపై ఇంట్లో కుటుంబసభ్యులతో మదనపడ్డాడు. తర్వాత ఇంటికి గొళ్లెం పెట్టి పరుగెత్తుకుంటూ సమీపంలోని కేసీ కెనాల్‌లో దూకాడు. ఈత కూడా రాకపోవడంతో క్షణాల్లో మునిగిపోయాడు. రాత్రి కావడంతో ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ తిరుపాలు సిబ్బందితో పాటు, బంధువులు కేసీ కెనాల్ వెంట గాలింపు చేపట్టారు.
దామాషా ప్రకారం
రిజర్వేషన్లు కల్పించాలి
కర్నూలు(సెంట్రల్) : జాతీయ స్థాయిలో ఓబీసీ కులగణన నిర్వహించడంతో పాటు దామాషా పద్ధతిలో రిజర్వేషన్లను కల్పించాలని బామ్‌సెఫ్ జాతీయ కమిటీ సభ్యుడు డాక్టర్ కె.హరిప్రసాదు డిమాండ్ చేశారు. ఓబీసీ హక్కుల సాధన కోసం ఓడిశా రాష్ట్రంలోని కథక్‌లో నిర్వహించ తలపెట్టిన జాతీయ స్థాయి బహిరంగ సభకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్నారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని బుధవారం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘాలతో కలిసి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఒడిశా ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా కలెక్టర్లకు వినతిపత్రాలు, 15వ తేదీన జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు, 22వ తేదీన ర్యాలీలు, ఫిబ్రవరి 22వ తేదీన నాగపూర్‌లోని ఆర్‌ఎస్‌ఎస్ కార్యాలయం ముట్టడి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.ఇందులో భాగంగా బుధ వారం ప్రజాసంఘాల నాయకులు, మేధావులు, న్యాయవాదులతో కలిసి కలెక్టర్ కార్యాలయంలో బామ్‌సెఫ్ ఉద్యమ కార్యచరణకు సంబంధించిన వినతిపత్రం ఇచ్చినట్లు వెల్లడించారు.


