దేవరకు వెళ్లి వస్తుండగా..
కౌతాళం: మండలంలోని ఎరిగేరి గ్రామంలో బంగారమ్మ దేవరకు వెళ్లి వస్తుండగా ఆటో ఢీకొని తల్లి కొడుకు దుర్మరణం చెందారు. తుంగభద్ర దిగువ కాలువ సమీపంలో బుధవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఎరిగేరి గ్రామంలో బుధవారం బంగారమ్మ దేవర జరుగుతుంది. కౌతాళం గ్రామానికి చెందిన రాము..భార్య మహదేవి, కుమారుడు నాగిరెడ్డి, మనవడు అభిరాంతో కలిసి ఆ గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లారు. దేవర ముగించుకుని సాయంత్రం ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయలుదేరారు. కౌతాళం నుంచి ఎరిగేరి వైపు ఎదురు వస్తున్న ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ రాంగ్ రూట్‌లో వెళ్లి బలంగా ఢీ కొట్టడంతో ఘటనా స్థలంలోనే మహదేవి (48), నాగిరెడ్డి (28) మృతి చెందారు. మహదేవి చేతిలో ఉన్న మనవడు అభిరాంకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న సీఐ అశోక్‌కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు నాగిరెడ్డి భార్య శాంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నాగిరెడ్డికి భార్య శాంతితో పాటు ఇద్దరు మగ పిల్లలు, ఒక కుమార్తె ఉన్నారు.
● తుంగభద్ర దిగువ కాలువ సమీపంలో ఘటన
దేవరకు వెళ్లి వస్తుండగా..
దేవరకు వెళ్లి వస్తుండగా..


