అందుబాటులో కందుల కొనుగోలు కేంద్రాలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో కందుల కొనుగోలు కేంద్రాలు అందుబాటులోకి వచ్చాయని, రైతులు మద్దతు ధరతో అమ్ముకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి, మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ రాజు తెలిపారు. ఇందుకోసం రైతు సేవా కేంద్రాల ద్వారా సీఎం యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు 5,379 మంది రైతులు పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. తేమ 12 శాతం లోపున్న కందులను మద్దతు ధర రూ.8వేలతో కొంటామన్నారు. కాటా వేయడం, లోడింగ్ వరకు అన్ని ఖర్చులు రైతులే భరించాల్సి ఉంటుందన్నారు. బస్తా 50 కిలోల ప్రకారం కొంటామని, గన్నీ సంచికి అదనంగా 700 గ్రాములు ఇవ్వాలన్నారు.
మార్కెట్‌కు తగ్గిన కందుల తాకిడి
కర్నూలు మార్కెట్‌లో వ్యాపారులు సిండికేట్ గా మారి ధరల పెరుగుదలను నిరోధిస్తున్నార నే విమర్శలు వెల్లువెత్తుతుండటంతో శనివారం మార్కెట్‌కు కందుల తాకిడి తగ్గింది. ఈ నెల 9న మార్కెట్‌కు 4,254 క్వింటాలు వచ్చింది. ధరలు అతి తక్కువగా లభించడంతో రైతులు ఆందోళన చేపట్టారు. శనివారం మార్కెట్‌కు 2,650 క్వింటాళ్లు వచ్చాయి. కనిష్ట ధర రూ.2000, గరిష్ట ధర రూ.6,979 లభించింది. మద్దతు ధర మాత్రం రూ.8000 ఉండటం గమనార్హం. వేరుశనగ ధర కాస్త పెరిగింది. మార్కెట్‌కు 165 క్వింటాళ్ల వేరుశనగ వచ్చింది. కనిష్ట ధర రూ.5,998, గరిష్ట ధర రూ.9009 లభించింది. మిర్చికి అంతంతమాత్రం ధరలే లభించాయి.
రేపు కలెక్టరేట్‌లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక
కర్నూలు(సెంట్రల్): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి శనివారం ఓ ప్రకటనలో తెలిపా రు. సమస్యలు ఉన్న ప్రజలు వినతులు సమర్పించుకోవచ్చన్నారు. కార్యక్రమాన్ని కలెక్టరేట్‌తోపాటు అన్ని మండల, డివిజినల్, మునిసిపల్ కార్యాలయాల్లోనూ నిర్వహిస్తామన్నారు. అర్జీదారులు తమ దరఖాస్తు పరిష్కారం కాకున్నా, పరిష్కారం ఏ దశలో ఉందో తెలుసుకోవడానికి కాల్ సెంటర్ నంబర్ 1100కు ఫోన్ చేయవచ్చన్నారు. అలాగే అర్జీదారులు meekoram.ap. gov.in అనే వెబ్‌సైట్‌లోనూ అర్జీలను నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
కొత్తపల్లి: నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన సరస్వతి క్షేత్రమైన కొలనుభారతిలో ఈనెల 23న వసంత పంచమి వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు శ్రీశైల దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. శనివారం ఆలయ ప్రాంగణంలో ఆర్డీఓ నాగజ్యోతి కలిసి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. కొలనుభారతి ఆలయం శ్రీశైల దేవస్థానంలో కలిసిన తర్వాత జరుగుతున్న తొలి వసంత పంచమి కావడంతో భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా తాగునీరు, క్యూ లైన్లు, మహిళలకు ప్రత్యేక గదులు, చిన్నారులకు అక్షరాభ్యాస ఏర్పాట్లు, పార్కింగ్ సౌకర్యాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్లాస్టిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని, విధుల్లో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్యే గిత్త జయసూర్య, ఆలయ చైర్మన్ వెంకటనాయుడు, స్థానిక సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్, ఎంపీడీఓ మేరి, తహసీల్దార్ ఉమారాణి పాల్గొన్నారు.
నంద్యాలలో భారీ అగ్ని ప్రమాదం
నంద్యాల: పట్టణంలోని శ్రీనివాస సెంటర్‌లోని జేబీ ఎలాక్ట్రానిక్స్ దుకాణంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దుకాణంలో నుంచి పొగలు, మంటలు రావడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ అగ్నిప్రమాదంలో రూ.50 లక్షలకు పైగా ఎలక్ట్రానిక్స్ పరికరాలు కాలిపోయాయి. దుకాణ మేనేజర్ రాజ్‌పురోహిత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అందుబాటులో కందుల కొనుగోలు కేంద్రాలు


