నీళ్లు లేవు.. పండుగకు పిలువం!
● పండుగ వేళ భయపెడుతున్న
నీటి సమస్య
● బంధుమిత్రులను పండుగకు
ఆహ్వానించలేకపోతున్న వైనం
ప్యాపిలి: కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సంక్రాంతి పండుగను ఘనంగా నిర్వహించుకోవాల్సిన ఆ రెండు గ్రామాల ప్రజలు నీటి సమస్యతో భయపడుతున్నారు. పండుగ పూట ఇంటికొచ్చిన వారికి నీటి కష్టాలు చెప్పలేమని, పండుగకు ఎవరినీ పిలుచుకోవడం లేదని చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వేసవికి ముందే నీటి సమస్య తలెత్తి ప్రజలు అవస్థలు పడుతున్నారు. నల్లమేకలపల్లి గ్రామంలో 2 వేల మంది నివసిస్తున్నారు. గ్రామంలో రెండు మంచినీటి బోర్లు ఉండగా ఒక బోరు మాత్రమే సక్రమంగా పని చేస్తోంది. అయితే ఈ బోరు నుంచి గ్రామంలోని ట్యాంకులకు సక్రమంగా నీటి సరఫరా కావడం లేదు. పలువురు తమ తోటలకు, ఇళ్లకు నేరుగా నీళ్లు వచ్చేలా కనెక్షన్లు ఇచ్చు కోవడంతో ట్యాంక్‌లోకి నీటి సరఫరా జరగడం లేదు. దీంతో నీటి ఎద్దడి ఏర్పడి ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఈ విషయమై గ్రామ పంచాయతీ కార్యదర్శికి పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. కాగా గ్రామంలో పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సర్పంచ్ సంధ్య గ్రామ పంచాయతీ తరపున ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. ఇదే పంచాయతీ పరిధిలోని డి. రంగాపురం గ్రామంలోనూ పది రోజులుగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. గ్రామ పంచాయతీకి సంబంధించిన మోటర్ పని చేయకపోవడంతో నీటి సమస్య తలెత్తిందని గ్రామస్తులు తెలిపారు. మరమ్మతులు చేపట్టాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. గ్రామ శివారు ప్రాంతంలో తోటలకు వెళ్లి ద్విచక్రవాహనాలు, ఎడ్ల బండ్లపై నీటిని తెచ్చుకుంటున్నామని తెలిపారు. మరో మూడు రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తుండటంతో గ్రామస్తులను నీటి సమస్య కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. పండుగకు తమ ఇంటికి వచ్చే బంధువులను సైతం నీటి సమస్య కారణంగా రావొద్దని చెప్పాల్సిన పరి స్థితి నెలకొందని ఓబులమ్మ, ఉషారాణి, సావిత్రి, నాగమ్మ తెలిపారు. అధికారులు స్పందించి బోర్లు, మోటర్లకు మరమ్మతులు చేపట్టి సమస్యను పరిష్కరించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
నీళ్లు లేవు.. పండుగకు పిలువం!


