కిలో చికెన్ రూ.300
● కోళ్ల కొరతతో
అమాంతం పెరిగిన ధరలు
కర్నూలు(అగ్రికల్చర్): సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మాంసం ధరలు షాక్ కొడుతున్నాయి. కోళ్ల కొరతతో కోడి మాంసం ధర అమాంతం పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పొట్టేలు మాంసం కిలో ధర రూ.900 నుంచి రూ.1000 పలుకుతోంది. ఈ నేపథ్యంలో కోడి కూరతోనైనా సరిపెట్టుకుందామంటే అది కూడా కొండెక్కి కూర్చుంటోంది. కర్నూలు నగరంలో నెల రోజుల క్రితం వరకు రూ.260 పలికిన చికెన్ ధర నేడు రూ.300 చేరుకోవడం గమనార్హం. బ్రాయిలర్ కోళ్ల చికెన్ వ్యాపారులకు తెలంగాణ రాష్ట్రమే ఆధారం. ఉమ్మడి కర్నూలు జిల్లా డిమాండ్‌లో 70 శాతం అక్కడి నుంచే దిగుమతి అవుతున్నాయి. 25 శాతం కోళ్లు కర్ణాటక నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. 5 శాతం కోళ్లు మాత్రమే జిల్లాలో ఉత్పత్తి అవుతున్నాయి. గత డిసెంబర్ నుంచి చికెన్‌కు డిమాండ్ పెరిగింది. క్రిస్మస్ పండుగ, ఆ తర్వాత నూతన సంవత్సరం వేడుకలతో పాటు చలి తీవ్రత అధికంగా ఉండటంతో చికెన్ వినియోగం అధికమైంది. ఈ నేపథ్యంలో డిమాండ్‌కు తగిన విధంగా కోళ్ల సరఫరా లేకపోవడంతో ధర ఆకాశాన్నంటుతోంది. రానున్న రోజుల్లో సంక్రాంతి పండుగ, ఆ తర్వాత కనుము ఉండటంతో చికెన్ ధర మరింత అవకాశం లేకపోలేదని వ్యాపారులు చెబుతున్నారు.


