పిల్లల బుర్రల్లో ‘సెల్’చల్!
ప్రపంచం అరచేతిలో ఇమిడిపోవడంతో మారుమూల పల్లెల్లోనూ సాంకేతిక వెలుగులు విరజిమ్ముతున్నాయి. ఈ ఆకర్షణలో బాల్యం మసిబారుతోంది. చందమామ కథలు వినిపించే ఓపిక లేకపోవడం.. ఉదయం లేచింది మొదలు ఉరుకులు పరుగుల జీవితం కావడంతో పిల్లల ఏడుపు మాన్పించేందుకు ‘సెల్’లో బందీ చేయడం సాధారణమైంది. తమ పని సాఫీగా సాగేందుకు, పిల్లలు అడ్డుకాకుండా ఉండేందుకు చేతిలో సెల్‌ఫోన్ పెట్టేస్తున్నారు. చిన్నారులు ‘నెట్టింట్లో’కి దూరిపోయి తమను తామే మైమరచిపోతున్నారు. ఆహ్లాదకర వాతావరణంలో ఆడుకోవాల్సిన పసి మనసులు.. మొబైల్ ఫోన్ విరజిమ్మే వెలుగులకు కళ్లు ఉబ్బిపోతున్నా ఓ మూలన కూర్చుండిపోతున్నారు. మట్టి వాసన తెలియకుండానే, పైరు గాలి పీల్చకుండానే.. బంధుత్వాలను తెలుసుకోకుండానే.. ఆటలతో స్నేహితులను తోడు చేసుకోకుండా.. వీడియో గేమ్స్‌తో ‘సెల్’చల్ చేస్తున్నారు. చుట్టూ ఎవరున్నారో చూసుకోకుండా, తిన్నామా లేదా అనే ధ్యాస లేకుండా సమయం కల్పించుకొని మరీ సెల్‌తో గడిపేస్తున్న తీరు ఆందోళన కలిగిస్తోంది.


