సార్..మమ్మల్ని ఆదుకోండి
● ఉల్లి మద్దతు ధర ఇప్పించాలని జిల్లా ఉద్యాన అధికారికి రైతుల మొర
కర్నూలు(అగ్రికల్చర్): ‘ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతోనే 4 నెలల క్రితం ఉల్లి గడ్డలు అమ్ముకున్నాం.. ఇంతవరకు మాకు మద్దతు సొమ్ము దక్కలేదు. చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఉల్లి రైతులు జిల్లా ఉద్యాన అధికారి రాజాకృష్ణారెడ్డి ఎదుట మొరపెట్టుకున్నారు. బుధవారం ఓర్వకల్ మండలం ఉప్పలపాడు గ్రామానికి చెందిన పలువురు రైతులు మద్దతు సొమ్ము కోసం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరిని కలిసేందుకు వచ్చారు. ఆమో అందుబాటులో లేకపోవడంతో జిల్లా ఉద్యాన అధికారిని కలిసి తమ గోడు వినిపించారు. 2025 సెప్టెంబరు నెల 20వ తేదీ లోపు ఒక్కో రైతు 50 నుంచి 200 క్వింటాళ్లు వరకు ఉల్లిగడ్డలు కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో అమ్ముకున్నారు. మద్దతు ధర రూ.1200 ఉండగా.. వ్యాపారులు కొన్న ధరను మినహాయించి వ్యత్యాసం మొత్తాన్ని ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. నెలల గడచిపోతున్నా ఇప్పటికి రూ.7.53 కోట్లు పెండింగ్‌లో ఉంది. కలెక్టరేట్‌కు వచ్చిన రైతుల్లో ఒక్కో రైతుది ఒక్కో బాధతో ఉండటం గమనార్హం. మద్దతు ధర మాకు సంబంధం లేదని, మార్క్‌ఫెడ్ అధికారులను కలవాలని జిల్లా ఉద్యాన అధికారి రైతులకు సూచించారు. అనంతరం రైతులు మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ జి.రాజును కలిశారు.


