అధిక చార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్
కర్నూలు: సంక్రాంతి పండుగ సందర్భంగా ‘స్పెషల్’ పేరుతో అధిక చార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్ చేస్తామని రవాణా శాఖ కర్నూలు డిప్యూటీ కమిషనర్ ఎస్.శాంతకుమారి హెచ్చరించారు. కర్నూలు మండలం బి.తాండ్రపాడు గ్రామ శివారులోని ఉప రవాణా శాఖ కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం కాంట్రాక్టు క్యారేజి, టూరిస్ట్ బస్సు ఓనర్లతో డీటీసీ సమావేశం నిర్వహించారు. ప్రతి బస్సుకు రెండో డ్రైవర్ విధిగా ఉండాలని, రోడ్డు భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని సూచించారు. హెల్ప్ లైన్ నెంబర్ 9281607001ను ప్రతి బస్సులో డిస్‌ప్లే చేయాలన్నారు. మోటర్ వాహనాల తనిఖీ అధికారులు రవీంద్ర కుమార్, నాగరాజు నాయక్, సుధాకర్ రెడ్డి, గణేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.
29, 30 తేదీల్లో విశాఖలో ఉప లోకాయుక్త క్యాంపు సిట్టింగ్
కర్నూలు(సెంట్రల్): ఈనెల 29, 30 తేదీల్లో విశాఖపట్నంలో క్యాంపు సిట్టింగ్ చేయనున్నట్లు ఉపలోకాయుక్త జస్టిస్ పి.రజనీ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. విశాఖపట్నం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అనకాపల్లి జిల్లాల ప్రజలు ఆ రెండు రోజుల్లో ఫిర్యాదులను ఇవ్వవచ్చన్నారు. అంతేకాక ఆ జిల్లాలకు సంబంధించిన పెండింగ్ కేసులను కూడా విచారణ చేస్తామన్నారు.
డీఈఓ కార్యాలయంలో సరైన ఏర్పాట్లు చే యకపోవడంతో దరఖాస్తుల అందజేతకు అభ్యర్థుల అవస్థలు
కలెక్టరేట్ ప్రాంగణం జాతరను తలపిస్తోంది. ఎక్కడ చెట్ల కింద చూసినా మహిళలు దరఖాస్తులు భర్తీ చేస్తూ కనిపిస్తారు. రోడ్లకు ఇరువైపులా చంటి పిల్లలతో ఇబ్బంది పడుతూ.. సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులను సరిచూసుకుంటూ.. అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పినట్లు పోస్టుల భర్తీ చేపట్టకపోగా.. అరకొర పోస్టులు అభ్యర్థులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది 111 పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దరఖాస్తుల సంఖ్య ఇప్పటికే నాలుగు అంకెలను చేరుకోవడం.. మరో రెండు రోజుల సమయమే ఉండటంతో పోటీ ఏస్థాయిలో ఉంటుందో అర్థమవుతోంది. ఎక్కడెక్కడి నుంచో వ్యయప్రయాసాలకోర్చి అభ్యర్థులు వస్తున్నా.. పోస్టులు దక్కడం అనుమానమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తే.. మెరిట్‌ను పరిశీలించుకునే అవకాశం ఉంటుంది, పారదర్శకత అనుమానాలను నివృత్తి చేస్తుంది. అలాకాకుండా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తుండటంతో నాయకులు చెప్పిన వాళ్లకే పోస్టులు దక్కుతాయనే చర్చకు తావిస్తోంది. ప్రతిభ ఆధారంగా 1ః1 నిష్పత్తిలో మౌఖిక ఇంటర్వ్యూకు పిలుస్తుండటంతో పోస్టుల భర్తీలో ‘రాజకీయం’ తప్పదని తెలుస్తోంది. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దగ్గరపడుతున్నా జాబ్ క్యాలెండర్ ఊసే లేకుండాపోయింది. నిరుద్యోగ భృతి ఎన్నికల హామీగానే మిగిలిపోయింది. ఇలాంటి చిన్న పోస్టులనైనా దక్కించుకుందామంటే ఇందులోనూ ‘పచ్చ’పాతం తప్పదని తెలిసి అభ్యర్థులు నిట్టూరుస్తున్నారు. ఇప్పటికే చాలాచోట్ల ద్వితీయ శ్రేణి నాయకులు ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల సిఫారసు లెటర్లకు భారీగా డబ్బు వసూలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోస్టులు ‘నోటు’మాటకు.. దరఖాస్తులు చెత్తబుట్టకనే చర్చ జరుగుతోంది.
– సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు
అధిక చార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్


