సంక్రాంతి ఆఫర్ల పేరిట సైబర్ మోసాలు
కర్నూలు: సంక్రాంతి పండుగ ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఐజీ/ఇన్‌చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆఫర్ల పేరుతో ఆకర్షణీయమైన సందేశాలతో మభ్యపెట్టి సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారన్నారు. ఆన్‌లైన్ లక్కీ డ్రా కూపన్లు, ఉచిత బహుమతుల పేరుతో లింకులు పంపి మొబైల్‌లో మాల్‌వేర్ ఇన్‌స్టాల్ అయ్యేలా చేసి డేటా దోపిడీ చేస్తారన్నారు. దీనివల్ల ఖాతాల నుంచి డబ్బు మాయం కావడం, సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ అవడం వంటి సమస్యలు ఎదురవుతాయన్నారు. సైబర్ మోసాలకు గురైన వెంటనే సైబర్ క్రైం హెల్ప్ లైన్ నెంబర్ 1930కి ఫోన్ ద్వారా కానీ లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని తెలిపారు.
గ్యాస్ డెలివరీకి అదనపు వసూళ్లు వద్దు
కర్నూలు(సెంట్రల్): గ్యాస్ సిలిండర్ల డెలివరీలో వినియోగదారుల నుంచి ఒక్క రూపాయి అదనంగా వసూలు చేసినా చర్యలు తప్పవని సివిల్ సప్లైస్ శాఖ డైరెక్టర్ గోవిందరావు ఏజెన్సీలను హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో దీపం–2 పథకం అమలు, ఐవీఆర్‌ఎస్ ఫీడ్ బ్యాక్ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్యాస్ డెలివరీ బాయ్స్ డబ్బులు వసూలు చేస్తున్నారని, వారి ప్రవర్తన ఏమాత్రం బాగోలేదని ఐవీఆర్‌ఎస్ ఫీడ్ బ్యాక్ వస్తోందన్నారు. ఈ అంశంపై ఏజెన్సీలు డెలివరీ బాయ్స్‌కు తగిన శిక్షణ ఇవ్వాలన్నారు. నిబంధల ప్రకారం 15 కిలోమీటర్ల లోపే గ్యాస్ సిలిండర్‌ల సరఫరా జరగాలని, ఒకవేళ అదనపు దూరం ఉంటే ఆ భారాన్ని డిస్ట్రిబ్యూటర్లు భరించాలన్నారు. సిలిండర్ డెలివరీకి ప్రభుత్వం ఏజెన్సీలకు రూ.73.08 చొప్పున చెల్లిస్తుందని, ఇందులో డెలివరీ చార్జీలు రూ.33.34, ఎస్టాబ్లిస్‌మెంట్ చార్జీలు రూ. 39.65 ఉంటాయన్నారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి, జేసీ నూరుల్ ఖమర్, డీఎస్‌ఓ ఎం.రాజారఘువీర్ పాల్గొన్నారు.
ఒక్క పాఠశాల మూతపడినా ఒప్పుకోం
● జెడ్పీ చైర్మన్ పాపిరెడ్డి
కొలిమిగుండ్ల: సరైన పర్యవేక్షణ లేక కొలిమిగుండ్ల మండలంలో తొమ్మిది పాఠశాలలు విలీనానికి సిద్ధంగా ఉన్నాయని, ఒక్క పాఠశాల మూత పడ్డా ఒప్పుకునేది లేదని జెడ్పీచైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కారపాకుల నాగవేణి అధ్యక్ష్యతన శుక్రవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. విద్యుత్ శాఖ అధికారులు రెండు సమావేశాలకు గైర్హాజర్ కావడంపై జెడ్పీ చైర్మన్ అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైద్య శాలలో మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. మండల స్థాయి అధికారులు సమస్యలు పరిష్కరించకపోతే జిల్లా కలెక్టర్‌కు నివేదికలు పంపాలని ఎంపీడీఓ దస్తగిరిబాబును ఆదేశించారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకానికి చెందిన మినరల్ వాటర్ గ్రామాలకు కాకుండా అల్ట్రాటెక్ సిమెంట్ ప్యాక్టరీలో ఎందుకు అమ్మకాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి
కర్నూలు(సెంట్రల్): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తప్పనిసరిగా బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఎంపీడీఓలు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సచివాలయ ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలన్నారు. ఉద్యోగులు బయోమెట్రిక్ హాజరు వేయకపోతే జీతాలు చెల్లించవద్దని ఎంపీడీఓలను ఆదేశించారు. ప్రజలతో మర్యాద పూర్వకంగా, గౌరవంగా ప్రవర్తించాలన్నారు. తప్పనిసరిగా ఇంటికే వెళ్లి పెన్షన్ అందజేయాలన్నారు. టెలీ కాన్ఫరెన్స్‌లో జెడ్పీ సీఈఓ నాసరరెడ్డి పాల్గొన్నారు.
సంక్రాంతి ఆఫర్ల పేరిట సైబర్ మోసాలు
సంక్రాంతి ఆఫర్ల పేరిట సైబర్ మోసాలు


