నిరుద్యోగ భృతి ఇవ్వకుంటే ఆత్మహత్యలే శరణ్యం
● కలెక్టరేట్ ఎదుట ఉరితాళ్లతో ప్రదర్శన
● చంద్రబాబు ప్రభుత్వ తీరుపై విద్యార్థి,
యువజన సంఘాల నేతల ఆగ్రహం
కర్నూలు(సెంట్రల్): ఎన్నికల్లో నిరుద్యోగులకు హామీ ఇచ్చిన మేరకు ఉద్యోగాలైనా ఇవ్వాలని, నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అయినా ఇవ్వాలని, లేదంటే ఆత్మహత్యలు తప్ప మరో దారి లేదని విద్యార్థి, యువజన సంఘాల వేదిక నాయకులు వినూత్నంగా నిరసనకు దిగారు. కలెక్టరేట్ ఎదుట సామూహికంగా తాళ్లతో ఉరి వేసుకొని ప్రదర్శన నిర్వహించారు.. ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాసులు, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి సోమన్న, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు కె.భాస్కర్, వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రెడ్డిపోగు ప్రశాంత్, రాష్ట్ర నాయకుడు గౌతం, ఆ పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి, యూత్ కాంగ్రెస్ నగర అధ్యక్షుడు హనోక్ హాజరై మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఏడాదికి 4 లక్షలు ఉద్యోగాలు చొప్పున ఐదేళ్లకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, లేదంటే నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇస్తామని టీడీపీ తన మేనిఫెస్టోలో ప్రకటించిందన్నా రు. అధికారంలోకి వచ్చి 19 నెలలు అయినా ఉద్యోగాలు భర్తీ చేయకపోగా ఒక్కరికీ రూ.3 వేల భృతి ఇవ్వలేదన్నారు.
జాబ్ క్యాలెండర్ ఏదీ?
జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రభుత్వ శాఖల్లోని ఉద్యోగాలను భర్తీ చేస్తానని చెప్పి మరోవైపు మంత్రి నారా లోకేష్ మోసం చేస్తున్నారని విమర్శించారు. ప్ర తి సంవత్సరం జాబ్ క్యాలెండర్ జనవరి 1న వస్తుంద ని చెప్పినా ఇప్పటి వరకు విడుదల చేయలేదన్నారు. ప్రభుత్వ శాఖల్లో 2.50 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, నిరుద్యోగులు మాత్రం ఇబ్బంది పడుతున్నారన్నారు. సరైన సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు చదువులకు దూరం కావాల్సి వస్తోందన్నారు.
ప్రశ్నిస్తే రౌడీషీట్, పీడీ యాక్ట్‌లా?
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ఉద్యోగాలు భర్తీకావాలని, ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలని ప్రశ్నించిన విశాఖపట్నం ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులపై పెట్టిన రౌడీషీట్, పీడీ యాక్ట్ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి, యువజన సంఘాల నాయకులపై కక్ష పూరితగా కేసులు పెట్టడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వం తన తీరును మార్చుకోకపోతే ఐక్య ఉద్యమాలు చేస్తామన్నారు. నాయకులు దుర్గ, నాగరాజు, శరత్‌కుమార్, అభి, అశోక్ పాల్గొన్నారు.


