అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం
కర్నూలు(సెంట్రల్): అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారాలు చూపాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆమె ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించాలన్నారు. సీఎంఓ నుంచి వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆమె సీఎంఓ నుంచి వచ్చి రీఓపెన్ అయిన కొందరి అర్జీదారులతో ఫోన్‌లో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. సమస్య పరిష్కారంలో అధికారులు వ్యవహరించిన తీరు, ఫీల్డ్ విజిట్ అంశాలపై ఆరా తీశారు.
పశుసంవర్ధకశాఖలో 14 మందికి పదోన్నతి
కర్నూలు(అగ్రికల్చర్): ఉమ్మడి కర్నూలు జిల్లా పశుసంవర్ధక శాఖలో 14 మంది జూనియర్ వెటర్నరీ ఆఫీసర్లకు వెటర్నరీ లైవ్‌స్టాక్ ఆఫీసర్లుగా పదోన్నతి లభించింది. పదోన్నతి పొందిన ఒక మహిళకు కోరుకున్న చోటుకు పోస్టింగ్ ఇచ్చే విధంగా చూస్తామని చెప్పిన జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారులు పెద్ద ఎత్తున ముడుపులు వసూలు చేశారనే చర్చ జోరుగా సాగుతోంది. పదోన్నతులు, పోస్టింగ్‌లు ఇవ్వడం పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ పరిధిలో ఉంటుంది. కర్నూలు మండలంలో పనిచేసే జేవీవోకు ఇదే మండలంలోని పంచలింగాలకు పోస్టింగ్ వేయిస్తామని నమ్మబలికి ముడుపులు గుంజినట్లు సమాచారం. అయితే కోడుమూరు నియోజకవర్గం టీడీపీ నేతల సిఫారసులతో పంచలింగాల వెటర్నరీ లైవ్‌స్టాక్ ఆఫీసరుగా శివనారాయణరెడ్డిని నియమించినట్లు తెలిసింది. పంచాలింగాలకు వేయిస్తామని చెప్పిన మహిళకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పోస్టింగ్ దక్కింది.
ఎకరాకు 10 క్వింటాళ్ల పత్తి కొనుగోలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో సీసీఐ ఆధ్వర్యంలో తొమ్మిది పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయని, వాటిలో ఎకరాకు పది క్వింటాళ్ల చొప్పున పత్తిని కొనుగోలు చేస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి పీఎల్ వరలక్ష్మి తెలిపారు. కపాస్ కిసాన్ యాప్, సీఎం యాప్‌లో ఎలాంటి టెక్నికల్ సమస్యలు లేవని, రైతులు మొదటి విడతలోనే పండించిన పత్తి మొత్తాన్ని అమ్ముకునే సదుపాయం లభించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి రోజు కపాస్ కిసాన్ యాప్ ఉదయం 10 గంటలకు ఓపన్ అవుతుందని, ఇందులో స్లాట్ బుక్ చేసుకోవాలని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
‘పది’ ఉత్తీర్ణత శాతం పెరగాలి
ఆలూరు: ఈ ఏడాది పదోతరగతిలో ఉత్తీర్ణత శాతం పెంచాలని పది పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ హెచ్.గోవిందునాయక్ విద్యాశాఖాధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన ఆలూరు మండలంలోని పెద్దహోతూరు, ప్రభుత్వ బాలుర–2, బాలికల –1 ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. ఆయా స్కూళ్లలో విద్యార్థులతో మాట్లాడి విద్యాబోధనపై ఆరా తీశారు. పిల్లలకు అర్థమయ్యేలా బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ ఏడాది జిల్లాలోని 345 జెడ్పీ ఉన్న పాఠశాలల నుంచి దాదాపు 35 వేల మంది విద్యార్థులు పది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. ఆయన వెంట ఆలూరు ఎంఈఓ కోమలాదేవి, ఎంఈఓ–2 చిరంజీవిరెడ్డి ఉన్నారు.
అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం


