ఉరుకుంద.. వయా పోలీసు స్టేషన్
ఎమ్మిగనూరుటౌన్: ఆర్టీసీ బస్సుల కొరతకు నిదర్శనం ఈ సంఘటన. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అధికారులు బస్సు సర్వీసులు నడపకపోవడంతో ప్రయాణికులకు వింత పరిస్థితి ఎదురైంది. ఎమ్మిగనూరు డిపో పరిధిలో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. గురువారం అమావ్యాస కావడంతో భక్తులు ఉరుకుంద క్షేత్రానికి చేరుకోవడానికి వివిధ ప్రాంతాల నుంచి ఎమ్మిగనూరు బస్టాండ్‌కు అధిక సంఖ్యలో చేరుకున్నారు. ఉరుకుందకు వెళ్లే ఉదయం 6 గంటల సర్వీసు బస్సు డిపో నుంచి బస్టాండ్‌కు చేరుకోవడంతో పరిమితికి మించి 120 మందికి పైగా ప్రయాణికులు ఎక్కారు. అయితే ఓవర్ లోడ్ కారణంగా బస్సు వెళ్లలేదని, కొందరు దిగి మరో బస్సులో రావాలని డ్రైవర్ సూచించారు. అసలే కోసిగి రోడ్డు శిథిలం కావడంతో అంతమందితో బస్సు నడపడం కష్ట మవుతుందని కొందరు దిగాలని డ్రైవర్, కండెక్టర్ చెప్పినా ప్రయాణికులు వారితో వాగ్వాదానికి దిగారు. దిగమంటూ భీష్మించడంతో ఇక డ్రైవర్ తాను ఏమి చేయలేనంటూ.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు బస్సును తీసుకెళ్లాడు. అక్కడ పోలీసులు వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తే తాము బస్సు దిగమని బస్టాండ్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ దిగమంటే ఎలా.. అంటూ ప్రశ్నించారు. చివరికి పోలీసులు నచ్చజెప్పడంతో కొందరు బస్సు దిగడంతో డ్రైవర్ ఉరుకుందకు బయలుదేరాడు. ప్రయాణికుల రద్దీ మేరకు ఆర్టీసీ అధికారులు బస్సులు నడపకపోతే ఎట్లా అంటూ మండిపడ్డారు.
ఆర్టీసీ బస్సులో పరిమితికి మించి
ఎక్కిన ప్రయాణికులు
ఓవర్ లోడ్ అంటూ
ముందుకు కదలని డ్రైవర్
దిగమని భీష్మించిన ప్రయాణికులు
బస్సు స్టేషన్‌కు తరలింపు..
సర్దిచెప్పిన పోలీసులు


