స్పర్శ లేకుండా ‘కుష్టు’ ఉత్పాతం
జిల్లాలో కుష్టు కేసుల వివరాలు సంవత్సరాల వారీగా..
● గతేడాది నుంచి పెరుగుతున్న కేసులు
● ఈ నెల 30 వరకు ఇంటింటా సర్వే
కర్నూలు(హాస్పిటల్): బ్యాక్టీరియా ద్వారా సోకే కుష్టు వ్యాధి జిల్లాలో గతేడాది నుంచి పెరుగుతోంది. చర్మంపై స్పర్శలేని రాగి రంగు గల మచ్చలు ఉన్న వారిని, చేతివేళ్లు, కాలివేళ్లు వంకర్లు తిరిగి, అరచేతులు, అరికాళ్లలో స్పర్శ కోల్పోయిన వారిని వైద్య సిబ్బంది గుర్తిస్తోంది. జిల్లాలో ఈ నెల 30 వరకు సర్వే కొనసాగనుంది.
సర్వే ఇలా..
జాతీయ కుష్టు నిర్మూలన కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎయిడ్స్ అండ్ లెప్రసీ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 30 వరకు ఇంటింటి సర్వే చేయనున్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో 4,58,936 గృహాలు, పట్టణ ప్రాంతాల్లో 1,85,916 గృహాలను సర్వే చేస్తారు. ఇందుకోసం 1,690 బృందాలు పనిచేస్తున్నాయి. ఒక్కో బృందంలో ఆశా, మగవలంటీర్ సర్వే చేస్తున్నారు. వీరిని 672 మంది ఏఎన్‌ఎంలు పర్యవేక్షిస్తున్నారు. మహిళలకు ఆశా, పురుషులను మగ వలంటీర్ పరీక్షిస్తున్నారు. ఒక్కో బృందం రోజుకు గ్రామాల్లో అయితే 25 నుంచి 50 గృహాలను, అర్బన్‌లో అయితే 50 నుంచి వంద గృహాలను సర్వే చేస్తుంది. అనుమానిత లక్షణాలున్న వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యులచే పరీక్ష చేయిస్తారు. వ్యాధినిర్ధారణ అయితే కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కుష్ఠువ్యాధి విభాగం లేదా చర్మవ్యాధుల విభాగానికి పంపించి చికిత్స చేయిస్తారు.
చుట్టుపక్కల ఇళ్లలో స్క్రీనింగ్ పరీక్షలు
నూతన కుష్టువ్యాధి కేసు బయటపడిన ప్రాంతంలో చుట్టుపక్కల 300 ఇళ్లల్లో స్క్రీనింగ్ నిర్వహిస్తారు. కేసు బయటపడిన ఇంటిలోని వారందరికీ కుష్టులేకపోయినా ముందుజాగ్రత్తగా మందులు ఇస్తారు. కుష్టు వ్యాధిగ్రస్తునికి మాత్రం ఒంట్లో పాసివ్ బేసిల్‌లై(తక్కువస్థాయిలో లెప్రసి క్రిములు) ఉంటే ఆరు నెలలు, మల్టీ బేసిల్‌లై(అధిక శాతం లెప్రసి క్రిములు) ఉంటే తొమ్మిది నెలల పాటు మల్టీ డ్రగ్ థెరపి(ఎండీటీ) మందులను ఉచితంగా అందజేస్తారు.
కుష్టు వ్యాధి గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఆరు నెలలు మందులు వాడితే పూర్తిగా నయం అవు తుంది. మందులు ప్రతి ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా లభిస్తాయి. అంగవైకల్యం ఉన్న వారు ఉచితంగా శస్త్రచికిత్స చేయించుకోవచ్చు. రోగులకు కుష్టు వ్యాధి విభాగంలో ఫిజియోథెరపీ కూడా చేయిస్తున్నాం.
–డాక్టర్ ఎల్. భాస్కర్, డీఎంహెచ్‌ఓ, కర్నూలు
సంవత్సరం కేసుల సంఖ్య
2018-19 304
2019-20 286
2020-21 77
2021-22 112
2022-23 188
2023-24 278
2024-25 214
ఈ యేడాది ఇప్పటి వరకు
102 కొత్త కుష్టు కేసులు బయటపడ్డాయి.


