పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టండి
కర్నూలు: వివిధ సంస్థలు, శాఖల్లో పెండింగ్ కేసుల పరిష్కారంపై దృష్టి పెట్టాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి సూచించారు. డిసెంబర్ 13న ఉమ్మడి జిల్లాలోని అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ధి సూచనల మేరకు గురువారం జిల్లా కోర్టులోని న్యాయ సేవా సదన్‌లో లీలా వెంకటశేషాద్రి ఆధ్వర్యంలో జాతీయ లోక్ అదాలత్‌పై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇన్సూరెన్స్, మున్సిపల్, ఫైనాన్స్ అండ్ చిట్‌ఫండ్స్, బ్యాంక్ మేనేజర్స్, ఇన్సూరెన్స్ న్యాయవాదులు, బీఎస్‌ఎన్‌ఎల్, పంచాయతీ అధికారులతో సమీక్షించారు. ఆయా శాఖలు, సంస్థలకు సంబంధించి కోర్టులలో పెండింగ్‌లో ఉన్న కేసులు, మోటర్ యాక్సిడెంట్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులు, బ్యాంకు డీఫాల్టర్, మున్సిపాలిటీ ప్రాపర్టీ, బీఎస్‌ఎన్‌ఎల్ కేసులు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. అవకాశాన్ని కక్షిదారులు కూడా వినియోగించుకుని రాజీ పూర్వకంగా కేసులను పరిష్కరించుకోవాలని కోరారు.


