ఆపరేషన్ థియేటర్ల మరమ్మతులు ఇంకెంత కాలం
● ఆసుపత్రి ఇంజనీరింగ్ అధికారులపై
కలెక్టర్ ఆగ్రహం
● పలు వార్డుల్లో రోగుల రికార్డుల
నిర్వహణపై అసంతృప్తి
కర్నూలు(హాస్పిటల్): ‘‘ఆపరేషన్ థియేటర్ల మరమ్మతులను ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు. గతంలో నేను తనిఖీకి వచ్చినప్పుడు నవంబర్ 20 కంతా పూర్తి చేస్తామన్నారు. మీరు చెప్పినట్లే ఈ రోజున మళ్లీ వచ్చాను. ఎక్కడ పూర్తయ్యాయి. ఈ విషయంలో అధికారులు పూర్తి బాధ్యతారాహిత్యంగా పనిచేస్తున్నారు’’ అని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.సిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆమె కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని పలు విభాగాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా క్యాజువాలిటిలో చికిత్స పొందుతున్న చిన్నకేశవ, కొండయ్య, షేక్ ఫాతిమా, రామచంద్రుడు అనే రోగుల సహాయకులతో మాట్లాడారు. వైద్యులు బాగా ట్రీట్‌మెంట్ చేస్తారని, త్వరగా కోలుకుంటారని ధైర్యం చెప్పారు. జనరల్ మెడిసిన్ ఓపీ విభాగాన్ని పరిశీలించి సీజనల్ వ్యాధులపై ఆరా తీశారు. రోగులకు సంబంధించిన రిజిస్టర్, రోగనిర్ధారణ, ఐపీ నెంబర్లు సరిగ్గా రాయడం లేదని ఆర్థోపెడిక్ విభాగ వైద్యులపై మండిపడ్డారు. ఆసుపత్రిలోని టాయిలెట్ల మరమ్మతుకు అంచనాలు సిద్ధం చేసి ఫైల్ పంపించాలన్నారు. ఆసుపత్రిలో స్క్రాప్ తొలగించకుండా ఎందుకు అలాగే వదిలేశారని, దీనివల్ల రోగులకు ఇన్‌ఫెక్షన్ రాదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కర్నూలు మెడికల్ కాలేజి విద్యార్థినుల వసతి గృహాన్ని తనిఖీ చేశారు. కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీబాయి, అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, వైద్యులు ఉన్నారు.


