పత్తి రైతుల ‘యాప్’సోపాలు!
● చుక్కలు చూపిస్తున్నకిసాన్ కపాస్ యాప్ ● పనులు వదులుకొని స్లాట్ బుకింగ్‌కు ప్రయత్నిస్తున్న రైతులు ● వారం రోజులుగా స్లాట్ బుకింగ్‌లో ఇబ్బందులు ● చోద్యం చూస్తున్నసీసీఐ, మార్కెటింగ్, వ్యవసాయ శాఖ
వారం రోజులుగా అష్టకష్టాలు..
కర్నూలు(అగ్రికల్చర్): నాలుగైదు నెలల పాటు రేయింబవళ్లు కష్టించి పండించిన పత్తిని మద్దతు ధరతో అమ్ముకునేందుకు రైతులకు తలప్రాణం తోకకు వస్తోంది. పత్తి రైతుల సహనానికి కిసాన్ కపాస్ యాప్ పరీక్ష పెడుతోంది. పత్తిని మద్దతు ధరతో అమ్ముకోవాలంటే తొలుత సీఎం యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోకున్న తర్వాత కిసాన్ కపాస్ యాప్ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంది. ఇక్కడే రైతులకు చుక్కలు కనిపిస్తున్నాయి. రైతులు ఇబ్బందులు పడుతుంటే ఇటు కాటన్ కార్పొరేషన్ అఫ్ ఇండియా, మార్కెటింగ్ శాఖ అధికారులు, అటు వ్యవసాయ అధికారులు చోద్యం చూస్తున్నారు. స్లాట్ బుకింగ్‌లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా యంత్రాంగం, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రతి రోజు ఉదయ 10 గంటలకు స్లాట్ బుకింగ్‌కు అవకాశం ఉంటంది. స్లాట్ బుక్ కావాలంటే కనీసం ఒకటి, రెండు నిమిషాల సమయం పడుతుంది. అయితే ఓటీపీ నెంబరు ఎంటర్ చేసే సమయంలోనే బుకింగ్ పూర్తయినట్లు కనిపిస్తోంది. ఇదేమీ సీసీఐ మాయనో రైతులకు అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు. యాప్ ద్వారా రైతులను ఇబ్బందులకు గురి చేస్తే తట్టుకోలేక బయట అమ్ముకుంటారనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారా.. అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, పెంచికలపాడులోని 11 జిన్నింగ్ మిల్లుల్లో పత్తిని మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నారు. జిన్నింగ్ సామర్థ్యాన్ని బట్టి పత్తిని కొనుగోలు చేయాలి. సామర్థ్యంలో కనీసం 50 శాతం కూడా కొనడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఏ కొనుగోలు కేంద్రానికై నా స్లాట్ బుక్ చేసుకోవచ్చు. వారం, పది రోజులుగా సర్వర్ సమస్య కారణంగా స్లాట్ బుకింగ్ అస్తవ్యస్తమైనప్పటికీ పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. వందలాది మంది రైతులు అన్ని పనులు వదిలి పెట్టి పత్తిని మద్దతు ధరతో అమ్ముకోవడానికి స్లాట్ బుకింగ్ కోసం నెట్ సెంటర్లు, రైతుభరోసా కేంద్రాల్లో కాచుకొని కూర్చుంటున్నా ఫలితం లేకుండా పోయింది. కొంతమందికి మాత్రం రెండు, మూడు జిన్నింగ్ మిల్లుల్లో స్లాట్ బుక్ అవుతుందంటే కిసాన్ కపాస్ యాప్ సరిగా లేదనే విమర్శలు వ్యక్తం అవు తున్నాయి. టెక్నికల్ సమస్యలు ఉంటే టోల్‌ఫ్రీ నంబరకు ఫోన్ చేయవచ్చని యాప్‌లోనే ఉంది. ఇంతవరకు టోల్‌ఫ్రీ నెంబరు పనిచేసిన దాఖలాలు లేవు. స్లాట్ బుకింగ్‌కే ఇంత సమయం పడుతుంటే సీసీఐ కేంద్రం వద్ద తమ పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులు అష్టకష్టాలు పడుతుంటే అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా అధికారులు, మార్కెటింగ్ శాఖ సూచనలు, ఆదేశాలను సీసీఐ పట్టించుకోవడం లేదని, అందువల్లనే రైతులు ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికై నా జిల్లా యంత్రాంగం తగిన చర్యలు తీసుకొని రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఎంతో ఉంది.


