రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
● మరొకరికి తీవ్రగాయాలు ● బంధువులను రైలు ఎక్కించి వస్తుండగా ప్రమాదం
మహానంది: బంధువులను నంద్యాల రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లి రైలు ఎక్కించి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన సీతారామాపురం వద్ద మంగళవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. గోపవరం గ్రామానికి చెందిన ఎం.వెంకట కృష్ణ (22), అతని బంధువు నందవరం గ్రామానికి చెందిన తిమ్మయ్య బంధువులను నంద్యాల రైల్వే స్టేషన్‌లో రైలు ఎక్కించి తిరిగి గోపవరం వస్తున్నారు. బైక్‌పై వస్తుండగా సీతారామాపురం సమీపంలో వడ్ల ట్రాక్టర్ రివర్స్‌లో వస్తుండగా ఎదురుగా మరో వాహనం రావడంతో లైట్ల వెలుతురులో సరిగా కనిపించలేదు. దీంతో బైక్ ట్రాక్టర్ ట్రాలీని ఢీకొట్టింది. వెంకటకృష్ణ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందగా తిమ్మయ్య తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంకటకృష్ణ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు.


