ఒకే భవనంలో మూడు కార్యాలయాలు
● ఆరు భవనాల మరమ్మతుకు
రూ.95.70 లక్షల జెడ్పీ నిధులు
కర్నూలు(అర్బన్): ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆరు డివిజన్ కేంద్రాల్లో డివిజినల్ డెవలప్‌మెంట్ కార్యాలయాలను అన్ని హంగులతో త్వరలో ప్రారంభించనున్నారు. కర్నూలు, ఆదోని, పత్తికొండ, ఆత్మకూరు, నంద్యాల, డోన్ డివిజన్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన డీడీఓ కార్యాలయాల్లోనే పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధికి సంబంధించిన డివిజనల్ పంచాయతీ అధికారి, డ్వామా ఏపీడీ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముగ్గురు డివిజినల్ స్థాయి అధికారులకు సంబంధించిన పాలనా వ్యవహారాలన్నీ ఇక నుంచి ఈ కార్యాలయం నుంచే కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ముగ్గురు డివిజినల్ స్థాయి అధికారుల కార్యాలయాలకు అనుగుణంగా ఆయా భవనాల్లో సౌకర్యాలను కల్పిస్తున్నారు. ఇందుకు జిల్లా పరిషత్ నిధులు రూ.95.70 లక్షలను కేటాయించారు. ఫర్నీచర్ ఇతరత్రాలకు అదనంగా మరో రూ.10 లక్షలను వెచ్చిస్తున్నారు. పనులు దాదాపుగా పూర్తయినట్లు జిల్లా పరిషత్ సీఈఓ జి.నాసరరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి డీడీఓ కార్యాలయానికి అవసరమైన సిబ్బందిని డిప్యూటేషన్‌పై నియమిస్తామన్నారు. ఒక్కో డీడీఓ కార్యాలయానికి ఒక సూపరింటెండెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక టైపిస్టు, ఇద్దరు ఆఫీసు సబార్డినేట్లను నియమిస్తున్నామన్నారు. ప్రతి డివిజన్‌కు ప్రత్యేకంగా నియమితులైన డీడీఓ ఆయా డివిజన్లలోని గ్రామ/వార్డు సచివాలయాల పర్యవేక్షణతో పాటు గ్రామ పంచాయతీల అభివృద్ధి, పన్నుల వసూలు తదితర అంశాలను పర్యవేక్షిస్తారన్నారు.


