
దగా చేసిన కూటమి ప్రభుత్వం
● దివ్యాంగుల పింఛన్లు తొలగించాలని
స్పీకర్ అయ్యన్న పాత్రుడు,
మంత్రి పార్థసారథి చెప్పడం దారుణం
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి
ఆలూరు రూరల్: దివ్యాంగుల పింఛన్లు తొలగించి కూటమి ప్రభుత్వం దగా చేసిందని ఎమ్మెల్యే విరూపాక్షి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు రామాంజినేయులు ఆధ్వర్యంలో శుక్రవారం ఆలూరులోని అంబేడ్కర్ సర్కిల్‌లో ధర్నా నిర్వహించారు. దివ్యాంగులు భారీ ఎత్తున తరలివచ్చి ‘ముఖ్యమంత్రి చంద్రబాబు డౌన్‌డౌన్’ అంటూ నినాదాలు చేశారు. ధర్నాకు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి మద్దతు తెలిపారు. ధర్నాలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రతి రోజూ ప్రజలు రోడ్డెక్కి నిరసనలు చేపట్టాల్సి పరిస్థితి ఏర్పడిందన్నారు. దివ్యాంగుల పింఛన్లు తొలగించాలని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి పార్థసారథి విలేకరుల సమావేశంలో చెప్పడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.62 లక్షల దివ్యాంగుల పింఛన్లు రద్దు చేసి ప్రతి నెలా రూ.280 కోట్లు ఆదా చేసుకునే పనిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందన్నారు. పింఛన్లు పునరుద్ధరించే వరకు పోరాటం ఆగబోదన్నారు. వైఎస్సార్‌సీపీ దివ్యాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు రామాంజినేయులు మాట్లాడుతూ..రాష్ట్ర వ్యాప్తంగా తొలగించిన దివ్యాంగుల పింఛన్లు పునరుద్ధరించే వరకు ఉద్యమాలు చేస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు ఆరు మండలాల దివ్యాంగులు పాల్గొన్నారు.