
దివ్యాంగులంటే కనికరం లేదా?
కర్నూలు (టౌన్): పింఛన్లపై ఆధారపడి జీవిస్తున్న దివ్యాంగులంటే రాష్ట్ర ప్రభుత్వానికి కనికరం లేదా అని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఏడాదిలో రాష్ట్రంలో 4.30 లక్షల పింఛన్లు తొలగించడం దారుణమన్నారు. తొలగించిన పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలన్నారు. లేదంటే దివ్యాంగుల తరఫున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కర్నూలులోని ఎస్వీ కాంప్లెక్స్‌లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు అమలు చేయడం చేతకాక రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లలో కోత విధిస్తోందన్నారు. దివ్యాంగులు ఆందోళనలు చేస్తున్నారని, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అయినా పాలకులు స్పందించడం లేదన్నారు. ఏళ్ల తరబడి పింఛన్ తీసుకున్న దివ్యాంగులకు మళ్లీ సదరం సర్టిఫికెట్ తీసుకురావాలని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. నిబంధనల పేరుతో కోత విధించాలని సదరం వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందన్నారు.
మోసం.. బాబు నైజం
హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేయడం టీడీపీ అధినేత చంద్రబాబు నైజమని ఎస్వీ మోహన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో 85 లక్షల మంది తల్లులకుగాను 54 లక్షల మందికి మాత్రమే తల్లికి వందనం ఇచ్చారన్నారు. మూడు సిలిండర్లకు గాను ఒక్కదానికే మాత్రమే నిధులు విడుదల చేస్తున్నారన్నారు. ఆడబిడ్డ నిధి పథకం కింద 18 సంవత్సరాలు దాటిన మహిళలకు రూ.1500 ఇవ్వలేదన్నారు. 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రూ.4 వేలు పింఛన్, నిరుద్యోగులకు రూ. 3 వేల నిరుద్యోగ భృతి, పీ–4 పథకం అంతా మోసమే అన్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు వరాలు జల్లులు కురిపించిన చంద్రబాబు ఏ ఒక్క హామీ అమలు చేయలేదన్నారు. ఇప్పటి వరకు డీఏ, ఐఆర్, పీఆర్‌సీ, సీపీఎస్ అమలు చేయలేదన్నారు. 16 నెలల వ్యవధిలో రూ.1.70 లక్షల కోట్లు అప్పులు చేసిన ఘనత చంద్రబాబుదే అన్నారు.
డీఎస్సీ మెరిట్ లిస్టులో గోప్యత ఎందుకు?
డీఎస్సీ మెరిట్ లిస్టులో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గోప్యత పాటిస్తుందని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. ఎంపికై న వారి జాబితా పారదర్శకంగా ప్రకటించకుండా లోపాయికారీ ఒప్పందం కుదిరిందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందన్నారు. బియ్యం స్కామ్, శాండ్, ల్యాండ్, వైన్, మైనింగ్‌లో టీడీపీ ఎమ్మెల్యేలు దోపీడీ చేస్తున్నారని విమర్శించారు. పార్టీ నాయకులు షరీఫ్, ఖలీల్, పాటిల్ హనుమంత రెడ్డి, రాఘవేంద్ర నాయుడు, కిషన్, ఫిరోజ్,ప్రభాకర్, తిరుమలేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో 4.30 లక్షల పింఛన్లు
తొలగించడం దారుణం
తొలగించిన పింఛన్లు వెంటనే
పునరుద్ధరించాలి
లేదంటే దివ్యాంగుల తరఫున
పోరాటం చేస్తాం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి