
పోలూరు వంకాయకు త్వరలో దేశవ్యాప్త గుర్తింపు
మహానంది: నంద్యాల జిల్లా పోలూరులో సాగయ్యే వంకాయకు త్వరలోనే దేశవ్యాప్త గుర్తింపు వస్తుందని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు డాక్టర్ ఠాగూర్ నాయక్, డాక్టర్ సీహెచ్ కిషోర్‌కుమార్, డాక్టర్ తమ్మాలి హేమాద్రి తెలిపారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. అనేక జిల్లాల నుంచి వ్యాపారులు పోలూరు వంకాయల కోసం వస్తుంటారన్నారు. ఇక్కడ పండించే వంకాయ ఓ కూరగాయగానే కాకుండా ప్రాచీన సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలతో పాటు అనంతపురం, ప్రకాశం, కడప, చిత్తూరు జిల్లాల్లోనూ ఈ పంట సాగవుతుందన్నారు. ఇంతటి ప్రసిద్ధి చెందిన పోలూరు వంకాయకు వ్యవసాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్(జీఐ) ట్యాగ్ పొందితే దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందన్నారు. అప్పుడు ఈ వంకాయలు ప్రీమియం కస్టమర్ల మార్కెట్‌లోకి ప్రవేశించి సరైన ధర చెల్లించేందుకు సిద్ధంగా ఉన్న వినియోగదారులను ఆకర్షిస్తుందన్నారు. తద్వారా మార్కెట్‌లో మంచి ధరలు లభించడంతో రైతులకు మేలైన లాభా లు ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. పోలూరు వంకాయ ప్రత్యేకతపై పరిశోధనలు చేసి యూనివర్సిటీకి సమర్పించనున్నట్లు వారు వివరించారు.
వంకాయ మొక్కను, కాయలనుపరిశీలిస్తున్న శాస్త్రవేత్తలు