డాక్టరు గారూ..ఇదేం రోగం! | - | Sakshi
Sakshi News home page

డాక్టరు గారూ..ఇదేం రోగం!

Aug 23 2025 2:04 AM | Updated on Aug 23 2025 2:04 AM

డాక్ట

డాక్టరు గారూ..ఇదేం రోగం!

బయటకు పరీక్షలు రాయొద్దని చెబుతున్నాము

ప్రైవేట్‌లో డబ్బులు ఖర్చు పెట్టి చూపించుకునే ఆర్థిక స్థోమత లేకనే పేదలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వస్తారు. అలాంటి వారికి పైసా ఖర్చు ఖర్చుకాకుండా చూడాల్సిన వైద్యులే అకారణంగా మందులు, వైద్య పరీక్షలు బయటకు రాస్తున్నారు. ఇందుకు ఇక్కడ వైద్యపరీక్షలు త్వరగా ఇవ్వరని, మరికొన్ని లేవన్న సాకులు చెబుతున్నారు. దీంతో తప్పని పరిస్థితిలో పేదలు ఎండనక వాననక కాయకష్టం చేసి సంపాదించి దాచుకున్న డబ్బును వైద్య పరీక్షలకు ఖర్చు చేయాల్సి వస్తోంది. ముఖ్యంగా ఆసుపత్రి ఎదురుగా ఉండే ఒక ల్యాబ్‌పై కొందరు వైద్యులు వల్లమాలిన అభిమానం చూపుతూ వైద్య పరీక్షలన్నీ అక్కడికే రాస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్‌ కడప, రాయచోటి జిల్లాల నుంచే గాక పక్క రాష్ట్రాలైన కర్నాటక, తెలంగాణాలోని పలు జిల్లాల నుంచి సైతం రోగులు చికిత్స నిమిత్తం వస్తున్నారు. ప్రతిరోజూ ఓపీ రోగుల సంఖ్య 2500 నుంచి 3వేల దాకా, ఇన్‌పేషంట్ల సంఖ్య 1200 నుంచి 1500ల దాకా ఉంటుంది. వీరిలో 70 శాతంకు పైగా రోగులకు పలు వైద్యపరీక్షలు అవసరం అవుతుంటాయి. రక్తపరీక్షలు, మూత్రపరీక్షలు, ఎక్స్‌రే, సీటిస్కాన్‌, ఎంఆర్‌ఐ, అల్ట్రాసౌండ్‌ వంటి పరీక్షలు ఆసుపత్రినే నిర్వహించేందుకు అవసరమైన వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది, పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఇందుకోసం ప్రత్యేకంగా డయాగ్నోస్టిక్‌ బ్లాక్‌ను నిర్మించారు. రోగులు ఆసుపత్రిలో అటు ఇటు తిరగకుండా అన్ని పరీక్షలు ఒకేచోట నిర్వహించేలా ఏర్పాటు చేశారు. ఇక్కడ దాదాపు అన్ని రకాల పరీక్షలు నిర్వహించేందుకు అవసరమైన రసాయనాలు, వైద్యపరికరాలు ఉన్నాయి.

ఆ ల్యాబ్‌ అంటే మక్కువ ఎక్కువ...!

ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉండే రాయలసీమ డయాగ్నోస్టిక్‌ ల్యాబ్‌ అంటే ప్రభుత్వ వైద్యులకు మక్కువ ఎక్కువలా కనిపిస్తోంది. వైద్యులు ప్రైవేట్‌కు రాసే వైద్యపరీక్షల్లో 80 శాతానికి పైగా పరీక్షలు అక్కడే నిర్వహించడం విమర్శలకు తావిస్తోంది. వైద్యపరీక్షలు రాసే వైద్యులకు ఈ ల్యాబ్‌ వారు భారీగా కానుకలు, కమీషన్లు ముట్టజెబుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్కడికి వెళ్లిన రోగులకు ఒక్కొక్కరికి రూ.వెయ్యి తక్కువ గాకుండా బిల్లు అవుతోంది. ఆసుపత్రిలో పరీక్షలు చేయిస్తే త్వరగా చేయరని, రిపోర్టులు ఆలస్యంగా వస్తాయని, అర్జెంటుగా వైద్యం చేయాలంటే బయట చేయించుకుని రావాలని పేర్కొంటూ పలువురు వైద్యులు రాయలసీమ ల్యాబ్‌కు వైద్యపరీక్షలు రాస్తున్నారు. ఇందులో అధికంగా గైనకాలజి, చిన్నపిల్లల విభాగం, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, చర్మవ్యాధుల విభాగం, పలు సూపర్‌స్పెషాలిటీ విభాగాలు ఉన్నాయి.

డయాగ్నోస్టిక్‌ బ్లాక్‌లో తీవ్ర జాప్యం

ఆసుపత్రిలోని డయాగ్నోస్టిక్‌ బ్లాక్‌లో వైద్యపరీక్షలు చేయించుకోవాలంటే ఒక యుద్ధమే చేయాల్సి వస్తోందని రోగులు అభిప్రాయపడుతున్నారు. ఇక్కడ ఉదయం రక్తపరీక్షకు ఇస్తే అందరికీ కలిపి మధ్యాహ్నం 2 గంటలకు రిపోర్టు ఇస్తున్నారు. ఆ రిపోర్టు తీసుకుని ఓపీకి వెళితే అప్పటికే వైద్యులు ఉండటం లేదు. మధ్యాహ్నం ఓపీలలో పీజీలు మాత్రమే వైద్యం చేస్తున్నారు. ఎక్స్‌రే పరీక్ష చేసినా రిపోర్టును మరుసటి రోజు ఇస్తున్నారు. అలాగే అల్ట్రాసౌండ్‌ పరీక్ష చేయించుకోవాలంటే కనీసం మూడు, నాలుగు గంటలు వేచి ఉండాలి. రోజుకు 400 రోగులకు పైగా వైద్యులు ఈ పరీక్ష చేస్తున్నారు. ఇక్కడ కూడా ఎక్కువ శాతం పీజీలే నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం నుంచి మరునాడు ఉదయం వరకు అత్యవసర రోగులకు పరీక్ష చేయించుకోవాలంటే వైద్యులు త్వరగా అందుబాటులో ఉండటం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఆసుపత్రిలో చెప్పుకోవడానికి మూడు సీటీ స్కాన్‌లు ఉన్నా పనిచేసేది రెండు మాత్రమే. పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ వారు ఇచ్చిన సీటీ స్కాన్‌ నిర్వహించేందుకు సిబ్బంది లేరని ప్రారంభించలేదు. పీపీపీ కింద నిర్వహించే దానిలో అత్యవసర కేసులు, ప్రభుత్వ సీటీ స్కాన్‌లో ఇన్‌పేషంట్లకు పరీక్షలు చేస్తున్నారు. వీటి రిపోర్టులు ఇవ్వడానికి కొన్నిసార్లు రోజుకు పైగా పడుతోంది. ఎంఆర్‌ఐ స్కాన్‌ చేయించుకోవాలంటే రోజుల తరబడి వేచి ఉండాలి. అది కూడా ఇన్‌పేషంట్‌ అయితేనే ఈ పరీక్ష చేస్తారు. ఈ పరిస్థితులను ఆసరాగా చేసుకున్న కొందరు వైద్యులు ప్రత్యేకంగా రాయలసీమ ల్యాబ్‌కు మాత్రమే ఎక్కువగా రాయడం విమర్శలకు తావిస్తోంది.

ఆసుపత్రిలోని డయాగ్నోస్టిక్‌ బ్లాక్‌లోనే అన్ని రకాల పరీక్షలు ఉన్నాయి. ఓపీ, ఐపీ రోగులకు ప్రైవేటు ల్యాబ్‌లకు పరీక్షలు రాయొద్దని వైద్యులకు చెబుతూనే ఉన్నాము. కొందరు అత్యవసరం పేరుతో రాస్తున్నట్లు ఉన్నారు. ఆసుపత్రిలో లేని కొన్ని మాత్రమే బయటకు రాస్తున్నారని తెలిసింది. ఆసుపత్రిలో ఉన్నా బయటకు రాసే వారిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాము.

–డాక్టర్‌ శ్రీరాములు, ఇన్‌చార్జ్‌ సూపరింటెండెంట్‌, జీజీహెచ్‌, కర్నూలు

వైద్యపరీక్షలు ప్రైవేటు ల్యాబ్‌లకు

ఇందులోనూ రాయలసీమ ల్యాబ్‌కు

అధిక శాతం

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని

అన్ని విభాగాల వైద్యులు సిఫారసు

వైద్యపరీక్ష రాసిన వారికి

30 శాతం దాకా కమీషన్‌

ఆసుపత్రిలో ఉన్న పరీక్షలు కూడా

బయటకే!

డాక్టరు గారూ..ఇదేం రోగం!1
1/2

డాక్టరు గారూ..ఇదేం రోగం!

డాక్టరు గారూ..ఇదేం రోగం!2
2/2

డాక్టరు గారూ..ఇదేం రోగం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement