
254 ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలే లక్ష్యంగా కార్యాచరణ
● జెడ్పీ సీఈఓ, డీపీఓ
కర్నూలు(అర్బన్): జిల్లాలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 254 గ్రామాలను ఓడీఎఫ్ ప్లస్ (బహిరంగ మల విసర్జన రహిత )గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు జిల్లా పరిషత్ సీఈఓ జీ నాసరరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి జి. భాస్కర్ చెప్పారు. శుక్రవారం జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో సమావేశమై జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించి సంబంధిత ఎంపీడీఓలకు కార్యాచరణను సూచించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ... మొత్తం 484 గ్రామ పంచాయతీల్లో 351 గ్రామ పంచాయతీల్లో వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. అలాగే వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు సంబంధించి స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ కింద 4271, ప్రధానమంత్రి ఆవాజ్ మోజన గ్రామీణ్ కింద 16,106 వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించాల్సి ఉందన్నారు. ఈ మేరకు ఆయా గ్రామాల్లోని ప్రజలకు అవగాహన కల్పించి మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు కార్యోణ్ముఖులు చేయాల్సి ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారుల సమన్వయంతో 277 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌లను నిర్మించాలన్నారు. జిల్లాలోని 484 గ్రామ పంచాయతీల్లో ఇప్పటి వరకు 409 సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ షెడ్లను నిర్మించామని, మిగిలిన వాటిని ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి పూర్తి చేయాలన్నారు. ఇందుకు సంబంధిత ఎంపీడీఓ, డిప్యూటీ ఎంపీడీఓ, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే 208 గ్రామాల్లో లిక్విడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌లను ఏర్పాటు చేయాలన్నారు.