
పరిశ్రమలతో యువతకు ఉపాధి
● జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో రిలయన్స్, అగస్త్యా, డ్రోన్స్‌హబ్ తదితర కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయని, ఈపరిశ్రమల ద్వారా వేలాది మంది యువతీ, యువకులకు ఉపాధి దొరుకుతుందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా తెలిపారు. కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో బిజినెస్ రిఫార్మ్ యాక్షన్ ప్లాన్–2024కు సంబంధించి యాజమాన్యాలతో సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓర్వకల్లులో పారిశ్రామిక పురోగతి కనిపిస్తోందన్నారు. ఇప్పటికే 5 వేల ఎకరాల్లో జయరాజ్ ఇస్పాత్ స్టీలు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పూర్తి కావొచ్చిందన్నారు. ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు సింగిల్‌డెస్కు పోర్టల్ ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పరిశ్రమల అధికారి జవహర్‌బాబు, డీడీ హరినాథ్‌రెడ్డి, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నారాయణరెడ్డి, భూగర్భ జలాల శాఖ డీడీ శ్రీనివాసులు, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ విజయ్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు.
లక్ష్యాలను సాధించాలి
శాఖల వారీగా ప్రభుత్వం నిర్దేశించిన కీలక నిర్వహణ సూచికల లక్ష్యాల సాధన కోసం కృషి చే యాలని అధికారులను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఆదేశించారు. వ్యవసాయం, హార్టికల్చర్ శాఖల లక్ష్యాలపై సమీక్షించారు.