
విదేశీ ఎగుమతులకు తపాలా సహకారం
● పోస్టల్ బిజినెస్ అసిస్టెంట్
డైరెక్టర్స్
కర్నూలు(అర్బన్): చిన్న వ్యాపారవేత్తలు, ఉత్పత్తిదారులు తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేసేందుకు తక్కువ వ్యయంతో తపాలా శాఖ పూర్తి సహకారాన్ని అందిస్తుందని ఆ శాఖ బిజినెస్ డెవలప్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్స్ చెప్పారు. శుక్రవారం స్థానిక ప్రధాన తపాలా కార్యాలయంలో డాక్ ఘర్ నిర్యాత్ కేంద్ర (డీఎన్‌కే ) సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయవాడ సర్కిల్ కార్యాలయం, రీజినల్ కార్యాలయం బిజినెస్ డెవలప్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్లు వై రామకృష్ణ, బీ నాగనాయక్, కర్నూలు పోస్టల్ సూపరింటెండెంట్ జీ జనార్దన్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తక్కువ వ్యయంతో పాటు వేగంగా కూడా ఉత్పత్తులను ఆయా దేశాలకు పోస్టల్ శాఖ ద్వారా పంపుకునేందుకు అవకాశాలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలోనే ఎగుమతి విధానాలు, అవసరమైన ఐఈసీ వివరాలు, తపాలా శాఖ అందిస్తున్న సౌకర్యాల గురించి వ్యాపారవేత్తలకు అవగాహన కల్పించారు. విదేశీ మార్కెట్లకు ఎగుమతి అవకాశాలపై తమకు ఉన్న సందేహాలను ఎంఎస్‌ఎంఈ ఎగుమతిదారులు నివృత్తి చేసుకున్నామన్నారు. పోస్టల్ శాఖలో ఉన్న డీఎన్‌కే అవకాశాలను వినియోగించుకుంటామన్నారు. కార్యక్రమంలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ గరీబ్‌భాషతో పాటు వ్యాపారస్థులు, ఉద్యోగులు పాల్గొన్నారు.