12 మండలాల్లో అకాల వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలోని వివిధ మండలాల్లో సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు 12 మండలాల్లో వర్షాలు కురిశాయి. నందవరంలో భారీ వర్షం కురిసింది. రికార్డు స్థాయిలో 69.8 మి.మీ వర్షపాతం నమోదైంది. కర్నూలు రూరల్‌లో 32.2, కర్నూలు అర్బన్‌లో 25.4, కల్లూరులో 23.2, మద్దికెరలో 7.6, ఓర్వకల్‌లో 6.8 మి.మీ ప్రకారం వర్షాలు కురిశాయి. జిల్లా మొత్తంగా సగటున 7.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కర్నూలు జిల్లాలో ఈ నెల 14న 3 మి.మీ, 15న 7.4, 16న 9, 17న 8.3 మిమీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. నంద్యాల జిల్లాలో 14న 2.1, 15న 9.8, 16న 12.1, 17న 10.1 మిమీ వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో పిడుగులు పడే ప్రమాదం కూడా ఉన్నట్లు పేర్కొన్నారు.
యూజీ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ఫలితాలు విడుదల
కర్నూలు కల్చరల్: డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ యూజీ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ సెమిస్టర్ ఫలితాలు విడుదలయ్యాయి. మంగళవారం వర్సిటీలోని వీసీ ఛాంబర్‌లో ఇన్‌చార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పీఎస్ షావలి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.లోకనాథ ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జి వీసీ మాట్లాడుతూ యూజీ నాల్గవ సెమిస్టర్ బీఏ ఎకనామిక్స్ (హానర్స్), బీకాం (హానర్స్), ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ జువాలజీ, ఆరో సెమిస్టర్ బీఏ (హెచ్‌ఈపీ), బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్, ఎనిమిదో సెమిస్టర్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ బాటనీ, జువాలజీ, పదో సెమిస్టర్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ బాటనీ, జువాలజీ ఫలితాలను విడుదల చేశామన్నారు. ఫలితాలు వర్సిటీ వెబ్‌సైట్ htt pr://ah uuk.-a-c.i n లో అందుబాటు ఉన్నాయన్నారు.
వాము వ్యాపారులు
సిండికేట్
● తగ్గిన ధరలతో నష్టపోతున్న రైతులు
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో వాము వ్యాపారులు సిండికేట్‌గా మారి రైతులను నష్టాలకు గురి చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మార్కెట్‌కు మంగళవారం 88 మంది రైతులు 280 క్వింటాళ్ల వాము తెచ్చారు. కనిష్ట ధర రూ.611, గరిష్ట ధర రూ.24,306 లభించింది. సగటు ధర కేవలం రూ.10,288 మాత్రమే నమోదైంది. వ్యాపారులు ఒకటి, రెండు లాట్లకు మాత్రమే ఎక్కువ ధర వేసి మిగిలిన లాట్లకు తక్కువ ధరలు కోట్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వ్యాపారులు సిండికేట్ కావడం వల్లే సగటు ధర రూ.10 వేలు మాత్రమే నమోదైందని రైతులు వాపోతున్నారు. కాగా వాము వ్యాపారులు టెండర్ హాల్‌లో యథేచ్ఛగా తిరుగుతూ ధరలను తారుమారు చేస్తున్నట్లు తెలుస్తోంది. టెండర్ హాల్‌లో కంప్యూటర్ ఆపరేటర్లను లోబరుచుకొని తమకు అనుకూలంగా ధరలు మారుస్తున్నారనే చర్చ జరుగుతోంది.
12 మండలాల్లో అకాల వర్షాలు


